Begin typing your search above and press return to search.

తోడల్లుడికి లోకేష్ గిల్లుడు...భరత్ భవిష్యత్తు ఏంటి...?

By:  Tupaki Desk   |   8 Sep 2022 4:30 PM GMT
తోడల్లుడికి లోకేష్ గిల్లుడు...భరత్ భవిష్యత్తు ఏంటి...?
X
రాజకీయాల్లో చుట్టరికాలు ఎంతలా కలసివస్తాయో అంతలా శాపంగా కూడా మారుతూంటాయి. మనవారే అనుకుని అల్లుకుని పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే టైం లో ఫ్యూచర్ లో అడ్డు వస్తారని దెబ్బేసే సీన్ కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. తెలుగునాట టీడీపీ అనే కాదు చాలా పార్టీలలో ఇలాంటి అడ్డు తెరలను తొలగించుకున్న సీన్లు వెతికితే బోలెడు కనిపిస్తాయి.

వెండితెర మీద ఒక్కరే హీరో ఉంటారు. అలాగే ప్రాంతీయ పార్టీలలో కూడా ఒకే ఒక పవర్ సెంటర్ ఉండాలి. రెండవది ఉంటే తేడా కొట్టేస్తుంది. ఇక నందమూరి వారు అందరికీ అన్న గారు అయిన ఎన్టీయార్ ఘనంగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ పట్టుమని పద్నాలుగేళ్ళు తిరగకుండానే నారా వారి టీడీపీగా మారిపోయింది. ఇపుడు ఉన్న టీడీపీలో పోటీ పడేందుకు నందమూరి ఫ్యామిలీ నుంచి టఫ్ కాంపిటేషన్ అయితే లేదు.

ఇప్పటికి దశాబ్దన్న‌ర క్రితమే బాలయ్యను వియ్యంకుడిగా చేసుకుని పక్కన ఉంచుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీయార్ ని కూడా 2009 ఎన్నికల ముందు ప్రచారం చేయించుకుని ఆనక సైడ్ చేసి పారేశారు అన్న మాట ఉంది. ఇపుడు టీడీపీలో అయితే బాబు లేకపోతే లోకేష్ తప్ప మధ్యలో మరో మాట లేదు, ఇంకో నాయకుడి ప్రసక్తి అంతకంటే రాదు. చంద్రబాబుకు పోటీగా నాడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉంటే ఆయన్ని చాలా తెలివిగా బయటకు పంపించారు. నోరున్న బావమరిది హరిక్రిష్ణ సైతం తరువాత పక్కకు వెళ్ళిపోయారు.

అయితే బాబు తరువాత తరం, చినబాబు తరంలో కూడా తోడల్లుడి నుంచి పోటీ వస్తోందా అంటే ఏమో రాజకీయాల్లో ఏమవుతుందో ఏమి చెప్పగలరు అన్న మాట ఉంది కాబట్టి ఆ పోటీని ఆదికి ముందే తొలగించుకునే ఆలోచన చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. బాలయ్య రెండవ అల్లుడు అయిన గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ కి రాజకీయంగా చాన్స్ ఇవ్వడానికి టీడీపీలో పెద్దలు ఇష్టపడడం లేదు అని అంటున్నారు.

ఇక శ్రీభరత్ విశాఖలో ఉంటున్నారు. ఆయన విద్యా సంస్థల అధినేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తనకంటూ ఒక పొలిటికల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆయన తాతలు ఇద్దరూ రాజకీయ ఉద్ధండ పిండాలే. తల్లి తరఫున తండ్రి కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అయితే తండ్రి వైపు తండ్రి మాజీ ఎంపీ, దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి. ఆయన వారసుడిగానే గీతం చైర్మన్ గా శ్రీ భరత్ ఉన్నారు. తాత మాదిరిగానే విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో శ్రీభరత్ కి విశాఖ ఎంపీ సీటు ఇచ్చారు. కానీ చాలా తక్కువ ఓట్లతో ఓడారు. నాడు ఆయన ఓటమి కూడా చిత్రంగానే చెప్పుకున్నారు. విశాఖ సిటీలో ఉన్న అన్ని సీట్లలో టీడీపీ గెలిచింది. కానీ అక్కడ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీలకు ఎంపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లలో తేడా ఉంది అని అంటారు. ఆ విధంగా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓడిన శ్రీ భరత్ పట్టువదలడంలేదు.

ఈసారి కూడా పోటీకి తాను రెడీ అంటున్నారు. ఆయన విశాఖ ఎంపీకే పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాదూ కూడదంటే భీమిలీ నుంచి కూడా పోటీ చేస్తారు అని అంటున్నారు. అయితే భరత్ కి టికెట్ ఇస్తారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. విశాఖ ఎంపీ సీటుని బీసీలకు ఇస్తారని ప్రచారంలో ఉన్న మాట. ఆ విధంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు.

అదే భీమిలీ టికెట్ అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కానీ, లేక లోకల్ అభ్యర్ధి కోరాడ రాజబాబుకు కానీ ఇస్తారని అంటున్నారు. దీంతో భరత్ ఆశలు వమ్ము అయినట్లేనా చర్చ అయితే సాగుతోంది. ఇదంతా ఎందుకు అంటే శ్రీభరత్ లోకేష్ కి స్వయాన తోడల్లుడు కాబట్టి రేపటి రోజున పార్టీలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుంది అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే శ్రీభరత్ మాత్రం తనకు తప్పకుండా టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారని అంటున్నారు. ఆయన తన పనులు తాను చేసుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికలలో చివరి నిముషంలో అది కూడా బాలయ్య సిఫార్స్ తో శ్రీభరత్ కి టికెట్ దక్కింది. మరి ఈసారి కూడా మామ జోక్యం చేసుకుంటారు అని అంటున్నారు. పైగా అంగబలం అర్ధం బలం దండీగా ఉన్న శ్రీభరత్ కి ఈ క్లిష్ట పరిస్థితుల్లో వదులుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. అయితే ముందే చెప్పినట్లుగా రాజకీయం ఇది. ఏం జరిగినా జరగవచ్చు అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.