Begin typing your search above and press return to search.

అక్కడ సైకిల్ జోరు : వైసీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా....?

By:  Tupaki Desk   |   14 July 2022 2:30 AM GMT
అక్కడ సైకిల్ జోరు :  వైసీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా....?
X
విశాఖలో ఆ సీటు వైసీపీకి దక్కడంలేదు. ఇప్పటికి రెండు ఎన్నికల్లో ఓడిన వైసీపీ మరోసారి అదే పరాభవాన్ని మూటకట్టుకోవడానికి సిద్ధంగా ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది. విశాఖ జిల్లాలోని విశాఖ తూర్పు సీటులో వైసీపీ గెలవడం మాట అటుంచి వర్గ పోరు మాని ఒక్కటిగా ఉండేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. ఒక విధంగా పార్టీ పటిష్టంగా ఉండేందుకు కూడా కృషి జరగడంలేదు.

మూడు వర్గాలు ఆరు తగవులతో ఆపసోపాలు పడుతోంది. విశాఖ తూర్పు నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సీనియర్ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇపుడు ఎమ్మెల్సీ అయ్యారు. అయినా ఆయన తన వర్గాన్ని కాపాడుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు దాకా ఆయనకు టికెట్ అని చెప్పి చివరి నిముషంలో భీమిలీ నుంచి వచ్చిన అక్రమనా విజయనిర్మలకు ఇచ్చేశారు. దాంతో నాడు వంశీ వర్గీయులు గుస్సా అయి ఏకంగా వైసీపీ ఎంపీ ఆఫీస్ నే ద్వంసం చేశారు. మొత్తానికి వారికి ఎలాగోలా నచ్చచెప్పి పరిస్థితిని రాజీ చేసినా విజయనిర్మల ఓడారు.

ఇక ఎన్నికలలో వంశీ వర్గం ఓట్లు తమకు పడలేదు అని విజయనిర్మల హై కమాండ్ కి ఫిర్యాదు చేసింది. నాటి నుంచి ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. ఇక వంశీకి ఎమ్మెల్సీ ఇస్తే విజయనిర్మలకు వీమ్మార్డీయే చైర్ పర్సన్ పదవి దక్కింది. ఇక ఇదే నియోజకవర్గం నుంచి విశాఖ మేయర్ గా గొలగాని హరి వెంకటకుమారి నెగ్గారు. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గం, ఒకే నియోజకవర్గం కావడంతో ఐక్యత కంటే పోటీ ఎక్కువ అయింది.

వచ్చే ఎన్నికల్లో విజయనిర్మలకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆమె ప్రస్తుతానికి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఇంకో వైపు మేయర్ హరి వెంకట కుమారి కూడా ఇదే సీటు నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. ఆమె మేయర్ గా ఉంటూ ఎక్కువగా తూర్పు మీదనే దృష్టి పెట్టారు. మేయర్ నుంచి ఎమ్మెల్యేగా మారిపోవాలని భావిస్తున్నారు. ఛాన్స్ వస్తే తాను రెడీ అని వంశీ చెబుతున్నట్లుగా భోగట్టా.

దీంతో వైసీపీ క్యాడర్ ఇక్కడ మూడుగా చీలిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగ్గురూ ఎవరి మటుకు వారు నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఎవరి దారి వారిదే, ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లుగా తూర్పు నియోజకవర్గం మారింది. దీంతో కార్యకర్తలు ఎవరితో ఉండాలి, ఏం చేయాలీ అన్నది తెలియక అయోమయం అవుతున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామక్రిష్ణబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చు అంటున్నారు. బీసీలకు అందునా యాదవ సామాజికవర్గానికి టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీలోని గ్రూప్ రాజకీయాలే గెలిపించేట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైసీపీ సంగతేంటి అని ఎవరైనా అడిగితే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అన్న జవాబు క్యాడర్ నుంచి వస్తోందిట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మనవే అంటున్న వైసీపీ హై కమాండ్ ఈ సీటు విషయంలో ఏం చేస్తుంది అన్నదే చూడాలి మరి.