Begin typing your search above and press return to search.

టీడీపీలో కొత్త చర్చ : వారు తగ్గారు... వీరి మాటేంటి...?

By:  Tupaki Desk   |   14 July 2022 1:30 AM GMT
టీడీపీలో కొత్త చర్చ : వారు తగ్గారు... వీరి మాటేంటి...?
X
తెలుగుదేశం పార్టీ సమరోత్సాహంతో ఉంది. చంద్రబాబు కూడా పంచు డైలాగులతో జోరు చేస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అన్నీ నేను చూసుకుంటాను, మీకు ఆకాశమే హద్దు అవకాశాలను వదలొద్దు అని క్యాడర్ కి పిలుపు ఇస్తున్నారు. ఇలా బాబు సందడి చేస్తూ పసుపు పార్టీలొ పరవశం తేవడానికి చూస్తున్న వేళ ఆ పార్టీలో ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు.

అదేంటి అంటే చంద్రబాబు ఆ మధ్యన చేసిన ఒక ప్రకటన ప్రభావంతోనే అని కూడా అంటున్నారు. చంద్రబాబు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈసారి ఎన్నికల్లో నలభై శాతం టికెట్లను యువతకు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. పార్టీకి కొత్త రక్తం అవసరమని అందువల్ల సీనియర్లు తప్పుకుని దారి ఇవ్వాలని కూడా ఆయన కోరారు. దాంతో సీనియర్లు ఏళ్ల కొలదీ పదవులు అనుభవించిన వారికి సీన్ అర్ధమైపోయింది. అదే టైమ్ లో వారు తమ వారసులకు ఏమైనా చాన్స్ ఉంటుందా అన్న ప్రయత్నాలలో ఉన్నారు.

ఇక చంద్రబాబు మాట విని ఎగిరిగంతేయాల్సిన యంగ్ బ్లడ్ మాత్రం ఆశించినంతగా రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. ఇప్పటిదాకా సీనియర్లు ఏలిన చోట జూనియర్లు ముందుకు వచ్చే పరిస్థితి అయితే పెద్దగా కనిపించడంలేదుట. దానికి కారణం అంగబలం, అర్ధ బలం అని చెబుతున్నారు. ఏళ్ళకు ఏళ్ళు పాతుకుపోయిన సీనియర్లకు అన్నీ ఉన్నాయి. వారికి మంచి ఫోకస్ ఉంది. అలాగే అన్నింటికీ వారు సిద్ధంగా ఉంటారు.

కానీ జూనియర్లకు అలా కాదు కదా. వారు ప్రతీదీ సమకూర్చుకోవాలి. మీకు ఛాన్స్ ఇస్తాను ని అధినాయకత్వం చెబుతున్నా దానికి తగినట్లుగా ధీటుగా తాము రెడీ కాలేకపోతున్నారు అని తెలుస్తోంది. ఆర్ధిక వనరుల లేమి అతి ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఇంకో వైపు సీనియర్ల నుంచి కొన్ని జిల్లాలలో సహకారం ఉండడంలేదుట. వారు కొత్త వారినీ, ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహించకుందా తమ వారసులను ముందు పెట్టి కధ నడిపించాలనుకుంటున్నారుట.

దాంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం హై కమాండ్ పిలుపు అందుకుని ముందుకు రాలేక అలాగని ఉండాల్సిన చోట ఉండలేక సతమతమవుతోంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయన్నది డౌటే లేని విషయం. దాంతో కనీసంగా యాభై కోట్లు ఉంటనే బరిలోకి దిగాలన్నది కూడా చెబుతున్న మాట.

మరి అలా చూసుకుంటే నిన్నటిదాకా ద్వితీయ స్థానంలోనే ఉండిపోయిన వారికి అంత స్తోమత ఎక్కడ నుంచి వస్తుంది అన్నది అతి పెద్ద ప్రశ్న. యూత్ ని ప్రోత్సహిస్తామన్నది మాటలకే కాకుండా వారికి అన్ని విధాలుగా అండదండగా అధినాయకత్వం ఉంటేనే వారికి టికెట్లు దక్కుతాయి. విజయాలు కూడా లభిస్తాయని అంటున్నారు. అయితే మరి సీనియర్లు ఇదంతా చూస్తూ ఊరుకుంటారా అన్నది మరో ప్రశ్న.

ఇక ఇపుడు హై కమాండ్ ఈ మాట అన్నా తీరా అవతల వైపు నుంచి అధికార పార్టీ బస్తీ మే సవాల్ అని బలవంతులను ముందు పెట్టి బరిలోకి దిగితే ఈ వైపు నుంచి కూడా అంతే స్థాయిలో అభ్యర్ధులను దింపాల్సి ఉంటుంది కదా అన్న చర్చ ఉంది.

ఈ నేపధ్యంలో యువతకు నలభై శాతం టికెట్లు అంటే కచ్చితంగా డెబ్బై దాకా ఇవ్వాలీ అంటే అయ్యే పనేనా. ఇపుడున్న హోరాహోరీ రాజకీయంలో సాగేనా. టీడీపీలో సీనియర్లు పడనిస్తారా, వారసులు చూస్తూ ఊరుకుంటారా ఇవన్నీ ప్రశ్నలేనట. మరి జవాబు ఏమిటి అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.