Begin typing your search above and press return to search.

వారిద్దరిని ప్రగతిభవన్ కు రావాలన్న కేసీఆర్.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   10 Nov 2022 2:30 PM GMT
వారిద్దరిని ప్రగతిభవన్ కు రావాలన్న కేసీఆర్.. ఇప్పుడేం జరగనుంది?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి మొండి ఘటం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందరికి కనిపించే మొండిఘటం వెనుక.. ఆయనలో కొన్నిసార్లు అవసరానికి మించిన తత్తరపాటు.. ఒత్తిడికి గురయ్యే అలవాటు కూడా ఉంటుందని చెబుతారు. కానీ.. ఇదేమీ పెద్దగా బయటకు రాదు. ఆయన్ను.. ఆయన రాజకీయ జీవితాన్ని నిశితంగా చూసినప్పుడు.. తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నత్త మాదిరి లోపల ఉండిపోయి.. తన చుట్టూ బలమైన షెల్ ను పెట్టేసుకున్న వైనం కనిపిస్తూ ఉంటుంది.

ఉద్యమం తీవ్రంగా జరిగిన వేళలోనూ.. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో ఎప్పుడూ కూడా కేసీఆర్ ముందుండి నడిపించిన దాఖలాలు కనిపించవు. ఆయనకు బాగా అలవాటైన పని.. ఫాం హౌస్ (ఫార్మర్ హౌస్)లో సేద తీరటం. అలాంటి ఆయన ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి ప్రగతిభవన్ లోనే ఉంటున్నారు తప్పించి.. ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు.

ఇదిలా ఉంటే.. గడిచిన రెండు రోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. ఒకవైపు గవర్నర్ తమిళ సైతో దూరం పెరుగుతూ ఉండటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేస్తుందన్న సంచలన సందేహాన్ని ఆమె బయటపెట్టారు. ఇదిలా ఉంటే.. కేంద్ర దర్యాప్త సంస్థలు ఈడీ.. ఐటీ అధికారులు బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తాళాలు బద్ధలు కొట్టి మరీ లోపలకు ప్రవేశించి.. సోదాలు నిర్వహిస్తే.. ఈ రోజు (గురువారం) టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన నివాసాలు.. కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న వైనం చూస్తే.. రానున్న రోజుల్లో ఏదో పెద్ద సంచలనం బద్ధలు కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


రెండు రోజుల్లో తన కేబినెట్ లోని మంత్రి.. తమ పార్టీ ఎంపీల నివాసాల్లో ఈడీ.. ఐటీ శాఖల అదికారులు సోదాలు నిర్వహిస్తున్న వేళ.. వారిద్దరిని తక్షణం ప్రగతిభవన్ కు రావాలన్న ఆదేశాలు జారీ చేసిన వైనం చూస్తే.. కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. మంత్రి గంగుల నివాసంతో పాటు.. ఆయన సోదరులు గంగుల సుధాకర్.. వెంకన్నతో పాటు బోనాల శ్రీనివాస్.. రాజేశం.. పొన్నమనేని గంగాధర్ రావు.. మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఇళ్లు.. ఆఫీసుల్లో సోదాల్ని నిర్వహిస్తున్నారు.

సోదాలు జరుగుతున్న నేతల్ని ఉన్నపళంగా ప్రగతిభవన్ కు రావాలని చెప్పిన వైనం చూస్తే.. ఓటుకు నోటు వ్యవహారం వేళలో.. చంద్రబాబు వ్యవహరించిన తీరు మాదిరే ప్రస్తుతం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అప్పట్లో రేవంత్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి.. అరెస్టు అయిన వేళలో.. చంద్రబాబు ఆయనకు సన్నిహితులుగా ఉండే నేతలతో పాటు.. అధికారులతో కలిసి గంటల కొద్దీ సమావేశాల్ని నిర్వహిస్తూ ఉండేవారు.

ఇప్పుడు ప్రగతిభవన్ లో అలాంటి సీన్ కనిపిస్తుందని చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఉదంతంలో కీలకంగా మారిన నలుగురు ఎమ్మెల్యేల్ని.. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రగతిభవన్ లోనే ఉంచేయటం.. వారిని మిగిలిన వారు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. మరోవైపు గులాబీ బాస్ అదే పనిగా రివ్యూలు నిర్వహిస్తుండటం కొత్త పరిణామంగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.