Begin typing your search above and press return to search.

అప్పుల‌ను ఇలా కూడా స‌మ‌ర్థించుకుంటారా.. కేటీఆర్ స‌ర్‌?!

By:  Tupaki Desk   |   6 Jan 2023 3:30 PM GMT
అప్పుల‌ను ఇలా కూడా స‌మ‌ర్థించుకుంటారా.. కేటీఆర్ స‌ర్‌?!
X
అప్పులు ఎందుకు చేస్తున్నావంటే.. `పుట్ట‌బోయే బిడ్డ‌కు పెళ్లిచేసేందుకు` అన్నాట్ట వెన‌క‌టికి ఓ వ్య‌క్తి. ఇప్పుడు అచ్చంగా తెలం గాణ మంత్రి కేటీఆర్ .. అప్పుల‌పై చేసిన‌వాద‌న కూడా అలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అప్పులు చేస్తోంది. దీనికి కొంత కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం అనే కార‌ణం కూడా ఉంది. దీనిని తోసిపుచ్చ‌లేం. అయినంత మాత్రాన ఇంత‌గా అప్పులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ ఇటీవ‌ల చుర‌క‌లు అంటించింది. ఎందుక‌నో.. కానీ, ఈ విష‌యా న్ని తెలంగాణ పెద్ద‌లు ప‌ట్టించుకోలేదు. కెలికి రచ్చ చేస్తే.. త‌మ‌కు ఇబ్బంది అనుకున్నారో.. ఏమో!!

అయితే.. తాజాగా తెలంగాణ అప్పుల పై మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ తాజాగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌పై వ్యాఖ్య‌లు చేశారు. ``భ‌విష్య‌త్తు త‌రాల అభ్యున్న‌తి కోస‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంది`` అని అన్నారు.

అంతేకాదు, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే పథకాలపై పెట్టుబడి పెట్టిందని కేటీఆర్ అన్నారు. నిజానికి భ‌విష్య‌త్ కోసం అప్పులు చేయ‌డం అనేది ఇప్పుడే వింటున్నాం. ఎందుకంటే.. అప్పులు అనేవి.. ప్ర‌స్తుత అవ‌స‌రాల కోసం.. ప‌డుతున్న ఇబ్బందుల నుంచి త‌ప్పించుకునేందుకు అప్పులు చేస్తారు. ఇక‌, ఆదాయాన్ని పెట్టుబ‌డులుగా మ‌ళ్లించి భ‌విష్య‌త్తును తీర్చిదిద్దే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడ‌తారు. వ్య‌క్తిగ‌త జీవితంలో అయినా.. ప్ర‌భుత్వ పాల‌నలో అయినా.. ఇదే విధానం కొన‌సాగుతుంది.

అంతేతప్ప‌.. రాబోయే త‌రాల కోసం పెట్టుబ‌డులు పెట్టేందుకు అప్పులు చేయాల్సిన అవ‌స‌రం ఏ ప్ర‌బుత్వానికికూడా ఉండదు. కానీ, కేటీఆర్ మాత్రం చాలా న‌ర్మ‌గ‌ర్భంగా తాము చేస్తున్న అప్పుల‌ను స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇది చూస్తే.. పైన చెప్పుకొన్న‌ట్టు.. పుట్ట‌బోయే బిడ్డ‌కు పెళ్లి చేసేందుకే అప్పులు చేస్తున్నామ‌న్న‌ట్టుగా ఉంద‌ని మేధావులు అంటున్నారు. అప్పులను ఇలా కూడా స‌మ‌ర్ధించుకోవ‌చ్చా? అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

నిజానికి హైద‌రాబాద్ వంటి కీల‌క న‌గ‌రం నుంచి ఆదాయం మెండుగా ఉన్న‌ప్ప‌టికీ.. అప్పులు చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు ఉంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనికి మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌డం లేదు. పైగా ఎదురు దాడి త‌ప్ప‌.. అప్పులు చేయ‌డ‌మూ ఆప‌డం లేదు. ఇలాంటి వుంటే.. ఉద్యోగుల‌కు జీతాలు, కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు కూడా చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం ఉండ‌డం మ‌రో కీల‌క విష‌యం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.