Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నుంచి పెరుగుతున్న జంపింగులు.. అయినా.. పెద‌వి విప్ప‌ని నేత‌లు

By:  Tupaki Desk   |   4 July 2022 3:42 PM GMT
టీఆర్ ఎస్ నుంచి పెరుగుతున్న జంపింగులు.. అయినా.. పెద‌వి విప్ప‌ని నేత‌లు
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. ఖైర‌తాబాద్ కార్పొరేట‌ర్‌, మాజీ ఎమ్మెల్యే ప‌బ్బ‌తిరెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డి కుమార్తె విజ‌యారెడ్డి కారు దిగి.. కాంగ్రెస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. ఇక‌, అప్ప‌టి నుంచి అనేక మంది నాయ‌కులు కారు దిగిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అయితే.. పెద్ద ఎత్తున కారు దిగేశారు. కార్య‌క‌ర్త‌లు వంద‌ల సంఖ్య‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లోనూ అలాంటి సీనే క‌నిపించింది. మ‌రి.. టీఆర్ ఎస్ నేత‌లు ముఖ్యంగా ఏం జ‌రిగినా.. వెంట‌నే రియాక్ట్ అయ్యే కేసీఆర్‌, కేటీఆర్‌లుఎందుకు మౌనంగా ఉంటున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

తాజాగా ఏం జ‌రిగిందంటే..

ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ ఎస్‌కు చెందిన‌ బడంగ్పేట్ మేయర్తో పారిజాతతో సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లిన‌.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. వారిని రాహుల్‌కు ప‌రిచ‌యం చేశారు. అనంత‌రం వారు కండువాలు మార్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ``తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిం ది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఇతర నాయకుల మాదిరిగా సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సోనియా, రాహుల్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించాం. మోడీ హయాంలో విదేశాల నుంచి దేశానికి రక్షణ లేకుండా పోయింది`` అని అన్నారు.

ఇక‌, మేయ‌ర్ పారిజాత మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సహకారంతో అభివృద్ధి కోసం కృషిచేస్తాన‌ని తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాన‌ని, తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని పారిజాత చెప్పుకొచ్చారు.

ఎందుకు మౌనం?

రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు పెర‌గ‌డం.. టీఆర్ ఎస్ నుంచి జంపింగులు కొన‌సాగుతుండ‌డం.. వంటి ప‌రిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎక్క‌డైనా.. ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. అధికార‌పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కానీ, కార్య‌నిర్వ‌హాధినేత‌.. కేటీఆర్ కానీ.. స్పందించ‌లేదు.మ‌రి వారు.. ఈ జంపింగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదా? లేక‌.. వెళ్లిపోయిన వారు చోటా నేత‌ల‌నే భావంతో ఉన్నారా? ఇవ‌న్నీ.. కాక‌.. ఎంత మంది పోయినా.. త‌మ‌కు ఫ‌ర్వాలేద‌నే ధీమాతో ఉన్నారా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి.. ఏం జ‌రుగుతుందో.