Begin typing your search above and press return to search.

ఉప ముఖ్యమంత్రి పదవి కిందకు నీళ్ళు... అంత ఆవేశమెందుకో...?

By:  Tupaki Desk   |   30 Aug 2022 11:30 PM GMT
ఉప ముఖ్యమంత్రి పదవి కిందకు నీళ్ళు... అంత ఆవేశమెందుకో...?
X
ఆయన పేరు బూడి ముత్యాలనాయుడు. శాంతస్వభావుడిగానే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు. ఆయన రెండు సార్లు మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన మీద జగన్ ప్రేమ కనబరచి రెండవ విడతలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి వంటి కీలక హోదాను ఇచ్చేశారు. అంతే కాదు పంచాయతీ రాజ్ శాఖను అప్పగించారు.  అయినా సరే బూడి డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా  పెద్దగా ఫోకస్ కాలేకపోతున్నారు. ఆయన ఎంతసేపూ మాడుగులలో ఉండడం లేకపోతే విజయవాడలోనే కనిపిస్తారు అని చెబుతారు.

తన పనేంటో తానేంటో అంటూ ఉండే బూడికి మీడియాతో పెద్దగా అటాచ్మెంట్స్ లేవు అంటారు. అయితే ఆయన విశాఖలో తాజాగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా మీటింగ్ లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో నీటి ఎద్దడి బాగా ఉందని మీడియా పేర్కొంది. పనిలో పనిగా మాడుగులలోని బూడొ సొంత ఊరిలో కూడా నీటి ఎద్దడి ఉందని పేర్కొనడంతో ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది.

మీరు చెప్పేది అబద్ధం, మా వూరిలో నీటి ఎద్దడి అన్నది లేదు, అది కనుక రుజువు చేస్తే ఈ రోజుకే ఇక్కడే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే గిరికీ రాజీనామా చేయడమే కాదు, రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని భారీ సవాల్ చేశారు బూడి మాస్టారు. నిజంగా అంత ఆవేశం అవసరమా అన్న చర్చ సొంత పార్టీ నుంచే వస్తోంది.

ఈ రోజున నీటి ఎద్దడి ఎటు చూసినా అతి  పెద్ద సమస్యగా ఉంది. అన్ని చోట్లా ఉంటోంది. ఒకవేళ ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటామని బూడి వారు అనవచ్చు. దానికి ఏకంగా తన పదవికీ రాజకీయానికి ముడి పెట్టి మరీ ఆయన ఇంతేసి సవాల్ చేయడమేంటి అని అంతా విస్తుపోతున్నారు.

ఇది ఆయనలో బాగా పెరిగిపోతున్న  అసహనానికి సంకేతమా అన్న చర్చ కూడా వస్తోందిట. రెండు సార్లు వరసగా గెలిచిన బూడి మీద వ్యతిరేకత మెల్లగా వస్తోంది. అదే టైం లో టీడీపీ కూడా బలంగా ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో బూడి ముత్యాలనాయుడు రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.

ఒక ఉప ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవిలో ఉన్నా ఆయన ధీటుగా జిల్లాలో తన హవా చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కలసి ఆయనలో అసహనం పెంచేశాయా అన్న చర్చ వస్తోంది. లేకపోతే మీడియా ఏదో అడుగుతుంది. దానికి జవాబు చెప్పి ఊరుకోవాలి కానీ ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటాను అన్న పెద్ద మాటలెందుకు బూడి సారూ అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.