Begin typing your search above and press return to search.

సున్నా వడ్డీ పధకం స్టార్ట్ చేసి...ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ లకు గుండు సున్నా...

By:  Tupaki Desk   |   22 April 2022 10:30 AM GMT
సున్నా వడ్డీ పధకం స్టార్ట్ చేసి...ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ లకు గుండు సున్నా...
X
ఏ ముఖ్యమంత్రి అయినా తమ జిల్లాకు వస్తున్నారు అంటే అక్కడ ప్రజలు ఆశగా చూస్తారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏమైనా వరాలు ఇస్తారని కూడా వేచి చూస్తారు. చెవులు రిక్కించి వింటారు కూడా. కానీ అలా ఆశపడిన ప్రకాశం జిల్లా ప్రకానీకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర నిరాశలో ముంచెత్తారు. ఆయన ఆర్భాటంగా సున్నా వడ్డీ పధకం మూడవ విడత కార్యక్రమానికి ప్రకాశం జిల్లాను ఎంచుకున్నారు.

ఆయన అక్కడ బటన్ నొక్కి 12 వందల కోట్ల రూపాయలను డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు పంపిణీ చేశారు. అంతే కాదు, తాను గత మూడేళ్ళుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 3,600 కోట్ల రూపాయల పై చిలుకు రూపాయలను ఇస్తున్నాను అని గొప్పగా చెప్పుకున్నారు. గత టీడీపీ సర్కార్ ఈ పని చేయేలేదని వారి మీద విమర్శలు కూడా చేశారు.

ఇక చంద్రబాబుని తన సభలో జగన్ అనేక సార్లు విమర్శించారు. ఆయన అనుకూల పత్రికలలో వచ్చిన వార్తలని సభాముఖంగా చదివి వినిపించారు. పేదలకు పధకాలు కావాలా వద్దా అంటూ వారినే అడిగి కావాలీ అని బదులు చెప్పించుకున్నారు. చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక టీడీపీ అనుకూల పత్రికలను గురించి వరసబెట్టి పేర్లతో సహా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా దత్తపుత్రుడు అంటూ ఆయన మీద కూడా పలు మార్లు విమర్శలు చేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ప్రకాశం జిల్లా సాగు, తాగు నీటి ప్రాజెక్టుల సంగతేంటి జగన్ బాబూ అంటే నో ఆన్సర్. అది కదా ప్రకాశం జిల్లా వాసుల బాధ. అంతకు ముందే సభలో మాట్లాడిన మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు ఈ రెండేళ్ళలో పూర్తి చేయాలని జగన్ని కోరారు. పశ్చిమ ప్రకాశం జిలాకు వరమైన ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నది ప్రజల చిరకాల‌ కోరిక.

అయితే వెలుగొండ ప్రాజెక్టు గురించి ఒక్క మాట అయినా సీఎం జగన్ చెబుతారేమో అని అంతా ఎదురు చూసినా వారికి నిరాశే మిగిలింది. టీవీల ముందు కూర్చుని చూసిన జిల్లా ప్రజానీకానికి గుండు సున్నావే మిగిలింది. అదొక్కటే కాదు, ప్రకాశం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చిన అనేక ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎక్కడా లేదు. ఆయన వాటి ఊసే తలవలేదు.

ఒక్క వెలుగొండ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, గుంటూరు చానల్ పొడిగింపు, రాళ్ళపాడు ఎడమ కాలువ, రామాయపట్నం పోర్టు, ఒంగోలు తాగునీటి ప్రాజెక్టులు. చూస్తే ఇలా చాలా ఉన్నాయి. మూడేళ్ళుగా వీటి అతీ గతీ లేదు. ఏ ఒక్క దానికీ నిధులు లేవు, ఆలోచన చేసేది అంతకంటే లేదు. మరి ఇపుడు చూస్తే ఏకంగా జిల్లా కేంద్రం ఒంగోలులో ముఖ్యమంత్రి సభ పెట్టి మరీ ఎన్నో కొన్ని వాటికైనా వరాలు ఇస్తారు అనుకుంటే ప్రకాశం జిల్లాకే అతి పెద్ద గుండుసున్నా పెట్టేసి వెళ్ళిపోయారు అని జనాలు అంటున్నారు అంటే తప్పేముందా.

మొత్తానికి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు వెలుగులు ఉన్నాయా జగన్ సారూ అంటే ఏమి చెబుతారో. అలాగే పాదయాత్ర హామీల మాటేంటి అంటే ఏమంటారో. నగదు బదిలీ పధకాలతోనే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా చప్పట్లు కొట్టించుకోవచ్చు సారూ. నిజానికి అవి శాశ్వతమైన ప్రగతి కూడా. మరి ఏలిన వారికి వాటి ఊసే అక్కరలేదు అనుకుంటే ప్రకాశం జిల్లాకు ప్రగతి ప్రకాశం అసలు అవసరం లేదు అనుకుంటే జనాలు చాలా సీరియస్ గానే ఆలోచించాల్సిందే మరి.