Begin typing your search above and press return to search.

గుండ్లు గీసుకొని.. చెప్పులతో కొట్టుకుంటున్నారు.. ఏపీలో ఉద్యోగుల నిరసన

By:  Tupaki Desk   |   2 May 2022 3:26 AM GMT
గుండ్లు గీసుకొని.. చెప్పులతో కొట్టుకుంటున్నారు.. ఏపీలో ఉద్యోగుల నిరసన
X
హామీలు ఇవ్వటం ఎంత తేలికో.. వాటిని అమలు చేయటం అంత కష్టం. అధికారంలోకి వచ్చేందుకు దేనికైనా రెఢీ అన్నట్లు హామీల మీద హామీలు ఇవ్వటం అందరూ చేసేదే. ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. అధికార సాధనలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఆయన వరుస పెట్టి హామీల వర్షం కురిపించేవారు.

సమస్య అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పరిష్కారం చెప్పి.. దానికి తాను అధికారంలోకి వచ్చినంతనే తీర్చేస్తానంటూ వరాల మీద వరాలు ఇచ్చేవారు. ఒక్క ఛాన్సు ఇవ్వండి.. మీ కష్టాల్ని ఖతం చేస్తానంటూ ఆయన కోరిన తీరుకు ముచ్చట పడిన ఏపీ ప్రజలు ఆయనకు చారిత్రక విజయాన్ని అందించారు. తిరుగులేని అధిక్యతను గెలిపించి.. అధికార దండాన్ని చేతికి ఇచ్చారు.

పాలనలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న వేళ.. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు.. టీచర్లు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఎందుకు అమలు చేయరంటూ మండిపడుతున్నారు.

ఇప్పటికే ఉద్యోగులు.. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై గుర్రుగా ఉండటం తెలిసిందే. తాజాగా విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద 'విశ్వాస ఘాతుకం' పేరుతో వినూత్న నిరసనను చేపట్టారు.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేసిన ఉద్యోగులు.. ఉపాధ్యాయుల్లో కొందరు.. గుండ్లు గీసుకొని.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసనను వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయటంతో తమకు తాము చెప్పులతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు.

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని వారు చెబుతున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రముఖంగా ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది ఉద్యోగులు.. ఉపాధ్యాయులకు అమలవుతున్న సీపీఎస్ ను తాము అధికారంలో్కి వచ్చినంతనే రద్దు చేస్తామని చెప్పటం తెలిసిందే. మూడేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చకపోగా.. సరికొత్త వాదనలు తెర మీదకు తెస్తున్న తీరుతో వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.