Begin typing your search above and press return to search.

మినిష్టర్ జయరాం ఇక్కడ : మేమే చెప్పుకుంటాం...ఒప్పుకుంటాం...

By:  Tupaki Desk   |   25 July 2022 10:00 PM IST
మినిష్టర్ జయరాం ఇక్కడ :  మేమే చెప్పుకుంటాం...ఒప్పుకుంటాం...
X
ఆయన వైసీపీ సర్కార్ లో కార్మిక మంత్రి. పేరు గుమ్మలూరి జయరాం. ఏకంగా మూడేళ్ల పై చిలుకు అధికారంలో ఉన్న అమాత్యులు. ఆయన తన సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆలూరులో జనం సాక్షిగా ఒక మాట చెప్పుకున్నారు. అదే నిజమని ఒప్పుకున్నారు.

అవును మేము రోడ్లు వేయలేకపోయాం. ఇది నిజం. ఏడాది క్రితం జస్ట్ అలా శంకుస్థాపనలు మాత్రమే చేసి వదిలేశామంతే అని అంటున్నారు. నిజంగా ఆయన్ని మెచ్చుకోవాలి.ఆయన డేరింగ్ నేచర్ కి ఒప్పుకోవాలి.

మిగిలిన వారి మాదిరిగా అసలు ఎక్కడా డబాయించలేదు. మేము అన్నీ చేశామని చెప్పలేదు. మేము రోడ్లు వేయలేదు అన్నారు. అంతేనా అలూరు నియోజకవర్గంలో మొత్తం నలభై రోడ్లు బాగులేవని లెక్క కట్టి మరీ చెప్పారు. అయితే ఆయన పెద్ద ఒట్టు కూడా పెట్టి జనాలను హామీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం మీద ఆన. ఈ రోడ్లు అన్నీ బాగుచేయిస్తాం అనేశారు.

వాటి పనులు ఆగస్ట్ 15 తరువాత స్టార్ట్ అవుతాయని కూడా మంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించి నిధుల సమస్య ఉంది. ప్రభుత్వం తొందరలో నిధులు విడుదల చేస్తే రోడ్లు పూర్తి చేసేస్తామని కూడా చెప్పేశారు. దాదాపుగా రెండువేల కోట్ల రూపాయలతో సీరోడు, తారు రోడ్లు పంచాయతీల నుంచి పట్నం దాకా వేసేస్తామని జయరాం అంటున్నారు.

అయితే రోడ్లు బాగులేవు అన్న మాట విపక్షాలు అంటే గయ్యిమని లేచిన వైసీపీ పెద్దలు తమ పార్టీకి చెందిన మంత్రి గారు చెబితే ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే ప్రశ్న. అలాగే ఆయన మేము ఏమీ చేయలేదు అని కూడా ఒప్పుకుంటున్నారు. దాంతో విపక్షాలు ఊపిరి పీల్చుకోవచ్చు.

అదే విధంగా రిలాక్స్ కూడా కావచ్చు. తాము చెప్పే మాటలను మంత్రిగారే ఒప్పుకుని తప్పు జరిగింది అంటూంటే వారికి అంతకంటే ఏం కావాలి. ఏమైనా గుమ్మలూరి మంత్రి గారు గమ్మున ఉండకుండా ఉన్నదంతా బయటకు చెప్పేశారు. అదే చాలు పదివేలు అంటున్నారు