Begin typing your search above and press return to search.

విశాఖను వీడినా...విజయసాయిరెడ్డి నీడలోనే

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:30 PM GMT
విశాఖను వీడినా...విజయసాయిరెడ్డి నీడలోనే
X
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2916లో విశాఖలో అడుగుపెట్టారు. ఆరేళ్ల పాటు ఆయన విశాఖలో వైసీపీ వ్యవహారాలను చూశారు. ఆయన కనుసన్ననలోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి చాలా మందిని వైసీపీ వైపు తిప్పారు. అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో సామాజిక పరిస్థితులను అంచనా కట్టి దానికి తగినట్లుగా అభయ్ర్ధుల ఎంపికలో కూడా హై కమాండ్ కి సలహా సూచనలు ఇచ్చారు. ఫలితంగా టోటల్ 34 సీట్లలో వైసీపీ ఏకంగా 28 సీట్లను గెలుచుకుంది. దాంతో విజయసాయిరెడ్డి మీద జగన్ కి మరింత నమ్మకం ఏర్పడింది.

అలా ఆయన 2022 వరకూ మూడేళ్ళ పాటు విశాఖలో తన హవా చాటుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన్ని విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయనకు ఎలా ఉందో తెలియడంలేదు కానీ ఆయన్ని నమ్ముకుని వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు, ఆయన చలువ ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవచ్చు అని భావించిన వారు అంతా ఇపుడు ఎటూ తోచక దిగాలు పడుతున్నారు.

విశాఖలో విజయసాయిరెడ్డికి చాలా మంది నేతలు సన్నిహితంగా ఉండేవారు. వారిలో తూర్పు నుంచి ఎమ్మెల్సీ గా ఉన్న వంశీ క్రిష్ణ యాదవ్ ఒకరు. ఆయనకు ఈ కీలక పదవి దక్కడానికి కారణం సాయిరెడ్డి. విజయసాయిరెడ్డి విశాఖను వీడాక ఆయన కూడా పూర్వం అంత చురుకుగా లేరని అంటున్నారు. తూర్పులో మంచి పట్టు ఉన్న ఆయన సాయిరెడ్డి చలువ ఉంటే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇపుడు ఆయన కొంత నిరాశ పడ్డారు అని అంటున్నారు.

అలాగే జీసీసీ చైర్ పర్సన్ గా ఉన్న స్వాతిరాణి టీడీపీ నుంచి వైసీపీలో లోకల్ బాడీ ఎన్నికల ముందు సాయిరెడ్డి సమక్షంలో చేరారు. ఆమెకు నామినెటెడ్ పదవి కూడా దక్కింది. అయితే ఆమె విజయాంగరం జిల్లా ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు.  కాకపోతే అరకు ఎంపీ గానైనా పోటీకి సిద్ధమని అంటున్నారు. విజయసాయిరెడ్డి ఇపుడు ఇంచార్జిగా లేరు. దాంతో ఆమె కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని విజయసాయిరెడ్డి బాగా ప్రోత్సహించారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో కోరుకున్న సీటు దక్కుతుందని భావించారు. ఇపుడు సాయిరెడ్డి విశాఖ సీన్ లో లేకపోవడంతో యువ మంత్రి కూడా పెద్ద దిక్కు అండ లేదని ఆలోచనలో పడుతున్నారని అంటున్నారు. విశాఖ ఉత్తర నుంచి కేకే రాజుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న డౌట్ కూడా ఇపుడు వస్తోందిట. ఆయన కూడా విజయసాయిరెడ్డి అండతో వైసీపీలో చురుకుగా ఉంటూ వచ్చారు.

ఇలా చాలా మంది నాయకులు అంతా విజయసాయిరెడ్డితో అనుబంధం కంటిన్యూ చేశారు. 2019 ఎన్నికలను సక్సెస్ ఫుల్ గా నడిపిన సాయిరెడ్డి 2024 ఎన్నికలను కూడా నడుపుతారు అని అనుకున్నారు. కానీ సడెన్ గా ఆయన  ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డిని తెచ్చారు. వైవీ పూర్తి స్థాయిలో విశాఖ రాజకీయాలను అవగాహన చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

దాంతో పాటు వర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఆయన నాకొద్దీ బాధ్యతలు అని ఒక దశలో జగన్ కి మొర పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి మీద విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా ఆయన డైనమిక్ లీడర్ షిప్ విశాఖ వైసీపీని స్ట్రాంగ్ గా చేసిందనే అంటున్నారు. చూడాలి మరి అసలే వైసీపీకి వ్యతిరేకత బాగా పెరుగుతున్న వేళ ఆ పార్టీ ఏ విధంగా నెట్టుకుని వస్తుందో అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.