Begin typing your search above and press return to search.

వైసీపీలో డేంజర్ నంబర్...?

By:  Tupaki Desk   |   30 April 2022 2:30 PM GMT
వైసీపీలో డేంజర్ నంబర్...?
X
పాస్ మార్కులు అంటే ఒకనాడు 35. ఇప్పటి తరం చదువులకు అసలు అచ్చి రాని నంబర్ అది. అంతా ర్యాంకుల కాలం. నూటికి నూరు మార్కులు వచ్చేస్తున్న రోజులు. ఇక రాజకీయాల్లో చూసుకున్నా జనాల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇస్తే డిస్టింక్షన్ లేక పోతే ఫెయిల్ అంతే మధ్యలో అత్తెసెరు మార్కులు అంటూ అసలు ఏవీ లేవు. అందుకే వైసీపీ హై కమాండ్ లో ఇపుడు వీర లెవెల్ లో టెన్షన్ స్టార్ట్ అయింది.

అదెలా అంటే 2019 ఎన్నికల్లో అధినాయకత్వం ఊహలకే అందనంతగా 151 సీట్లతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వైసీపీ మూడేళ్ళు తిరగకుండానే అత్తెసెరుకు పడిపోయిందా అన్న చర్చ అయితే వస్తోంది. నా వరకూ నా ర్యాంక్ బాగుంది. మీ సంగతే చూసుకోండి అంటూ సీఎం జగన్ సుతిమెత్తగా ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. మీరు బాగుంటే ఓకే లేకపోతే బరువు అసలు మోయలేను అని కూడా తేల్చేశారు.

అలా జగన్ దగ్గర ఉన్న నివేదికలు చూస్తే మూడవ వంతు వైసీపీ ఎమ్మెల్యేలకు అసలు పాస్ మార్కులు రానేలేదుట. వారితో ఎన్నికలకు వెళ్తే వైసీపీ మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవడం కూడా కష్టమే అంటున్నారు.

అందుకే తాజాగా మంత్రులు, పార్టీ అధ్యక్షుల సమావేశంలో కాస్తా కటువుగానే మాట్లాడారు అంటున్నారు. ఏం చేస్తారో తెలియదు మరో ఆరేడు నెలల్లో మీ గ్రాఫ్ పెరగాల్సిందే అంటూ హుకుం కూడా జారీ చేశారు.

ఈ విధంగా చూస్తే వైసీపీలో ఏకంగా 47 మంది ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు కూడా రాలేదని తెలిసింది. వారంతా జనాల అంచనాలకు ఆమడ దూరంగా ఉండిపోయారు అంటున్నారు. వీరి పనితీరుని అంచనా కట్టి మరీ రూపొందించిన నివేదికలను సీల్డ్ కవర్ లో అధినాయకత్వం వారికే ఇచ్చి జాగ్రత్త సుమా అని హెచ్చరించి పంపినట్లుగా ప్రచారం సాగుతోంది.

అలా శ్రీముఖాలు అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరు, ఏ జిల్లాలకు చెందిన వారు అన్న చర్చ అయితే ఒక వైపు సాగుతోంది. తీరా చూస్తే గోదావరి, కోస్తా, ఉత్తరాంధ్రా జిల్లాలలోనే ఎక్కువ నంబర్ కనిపిస్తోంది అని చెబుతున్నారు. వారిలోనే ఎక్కువ మందిని పాస్ మార్కులు కూడా రాలేదని అంటున్నారు. మరి పని తీరు మార్చుకుని వారు కనుక జనాల మెప్పు పొందకపోతే మాత్రం కఠిన నిర్ణయాల దిశగానే వైసీపీ హై కమాండ్ అడుగులు వేస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ లిస్ట్ తగ్గుతుందా లేకా పెరుగుతుందా అన్నది ఫ్యూచర్ లో వైసీపీ రాజకీయ తెర మీద.