Begin typing your search above and press return to search.

మ‌రింత ఖ‌రీదు కానున్న న్యూస్ పేప‌ర్లు!

By:  Tupaki Desk   |   14 Aug 2018 6:13 AM GMT
మ‌రింత ఖ‌రీదు కానున్న న్యూస్ పేప‌ర్లు!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ పేప‌ర్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయా? అంటే అవున‌న్న మాట వినిపిస్తుంది. ఆ మ‌ధ్య‌న నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు పెరిగిన నేప‌థ్యంలో మూడు రూపాయిలు ఉన్న పేప‌ర్ ను రూ.5 చేసేస్తూ.. న్యూస్ పేప‌ర్లు నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం వారంలో ఆరు రోజులు రూ.5.. ఆదివారం రూ.6 చొప్పున వ‌సూలు చేస్తున్న తెలుగు పేప‌ర్లు.. సెప్టెంబ‌రు 1 నుంచి మ‌రింత ప్రియం కానున్న‌ట్లుగా చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం న్యూస్ పేప‌ర్లు ధ‌ర‌లు పెంచేందుకు సిద్ధం అవుతున్నార‌ని.. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ఖ‌ర్చుల‌తో పాటు.. నిర్వ‌హ‌ణ అంత‌కంత‌కూ క‌ష్టంగా మార‌టంతో న్యూస్ పేప‌ర్ల యాజ‌మాన్యాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా ధ‌ర‌లు పెంచాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈనాడు.. సాక్షి.. ఆంధ్ర‌జ్యోతితో పాటు మిగిలిన అన్ని న్యూస్ పేప‌ర్లు త‌మ ధ‌ర‌ల్ని పెంచేస్తూ నిర్ణ‌యాన్ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వారంలో ఉన్న రూ.5 రేటు స్థానే రూ.8.. ఆదివారాల్లో రూ.10 చేస్తార‌ని తెలుస్తోంది. అయితే.. ఇంత భారీగా ధ‌ర‌లు పెంచితే.. స‌ర్క్యులేష‌న్ మీద తీవ్ర ప్ర‌భావం ఉంటుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. కొన్ని వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ధ‌ర పెంచుతారే కానీ.. ఇంత భారీగా ఉండ‌ద‌న్న మాట‌ను చెబుతున్నారు. ఒక‌ట్రెండు రూపాయిలు.. లేదంటే మూడు రూపాయిల‌కు మించి ధ‌ర‌ల పెరుగుద‌ల ఉంద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతున్నారు.

ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కార‌ణంగా ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాలుగా తెలుస్తోంది. న్యూస్ పేప‌ర్ల‌కు కీల‌క‌మైన న్యూస్ ప్రింట్ ఖ‌రీదు కావ‌టం.. ప్ర‌భుత్వం విధించిన ప‌న్ను భారీగా ఉండ‌టంతో పాటు.. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ట‌న్ను న్యూస్ ప్రింట్ గతంలో రూ.30వేలు ఉంటే.. ఇప్పుడ‌ది కాస్తా రూ.66వేల‌కు పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. న్యూస్ ప్రింట్ మీద దిగుమ‌తి సుంకాన్ని భారీగా పెంచేయ‌టంతో న్యూస్ పేప‌ర్ల యాజ‌మాన్యాల మీద భారం భారీగా మారింది.

ఈ కార‌ణంతోనే.. ఆ మ‌ధ్య‌న పెంచి పేజీల్ని సైతం గుట్టుచ‌ప్పుడు కాకుండా క‌ట్ చేయ‌టం కనిపిస్తుంది. ఆర్నెల్ల క్రితం 18 పేజీల‌కు త‌గ్గ‌కుండా వ‌చ్చిన తెలుగు న్యూస్ పేప‌ర్లు ఇప్పుడు ప‌ద్నాలుగు.. త‌ప్ప‌ద‌నుకుంటే ప‌ద‌హారు పేజీలకే ప‌రిమితం అవుతున్నాయే త‌ప్పించి పెర‌గ‌టం లేదు. ప్ర‌క‌ట‌న‌లు భారీగా వ‌చ్చిన‌ప్పుడు మాత్రం పేజీల్ని పెంచుతున్నారు.

న్యూస్ ప్రింట్ ధ‌ర పెర‌గ‌టంతో పాటు.. ర‌వాణా ఛార్జీల భారం భారీగా ఉందంటున్నారు. ఇటీవ‌ల కాలంలో పెరిగిన డీజిల్ ధ‌ర‌లు మీడియా సంస్థ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ప్ర‌క‌ట‌న‌ల మీద వ‌చ్చే ఆదాయం కూడా త‌గ్గిపోవ‌టం మీడియా సంస్థ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.

ఇటీవ‌ల పెరిగిన డిజిట‌ల్ మీడియాతో పాటు.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. ప్ర‌క‌ట‌న‌లను ఇచ్చే సంస్థ‌లు ప్రింట్ మీడియా బ‌డ్జెట్ల‌ను కొంత మేర డిజిట‌ల్ మీడియంకు మ‌ళ్లించ‌టంతో ఆదాయాలు త‌గ్గుతున్నాయి. అదే స‌మ‌యంలో.. పెరిగిన ఖ‌ర్చులు మీడియా సంస్థ‌ల‌కు గుదిబండ‌లా మారాయి. దీంతో.. న్యూస్ పేప‌ర్ల ధ‌ర‌ల్ని పెంచ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎవ‌రైనా పొదుపు చ‌ర్య‌ల్ని షురూ చేయాల‌నుకుంటే.. వెంట‌నే న్యూస్ పేప‌ర్ల‌ను ఆపేయ‌టం ఇప్ప‌టికి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో న్యూస్ పేప‌ర్ల ధ‌ర‌ల్ని భారీగా పెంచేస్తే.. ఆ ప్ర‌భావం స‌ర్య్కులేష‌న్ మీద ప‌డుతుందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. తెలుగు న్యూస్ పేప‌ర్ల‌తో పాటు.. ఇంగ్లిషు న్యూస్ పేప‌ర్లు సైతం ధ‌ర‌ల్ని పెంచే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. సో.. కొత్త భారానికి సిద్ధ‌మైపోండి.