Begin typing your search above and press return to search.

ఈ మచ్చను చెరిపేసుకోవాల్సిందే జగన్?

By:  Tupaki Desk   |   29 April 2022 5:06 AM GMT
ఈ మచ్చను చెరిపేసుకోవాల్సిందే జగన్?
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీలోని జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి పెడుతున్నాయి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మహిళలపై దారుణాలు పాల్పడే వారికి.. వారిని వేధించే వారికి వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఇటీవల కాలంలో మహిళలపై దాడులు ఎక్కువ అయ్యాయి. మొన్నటికి మొన్న విజయవాడలో ఒక యువతిని ఆసుపత్రిలో బంధించి 36 గంటల పాటు అత్యాచారానికి గురి చేసిన వైనం ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మహిళ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు (కాదు నలుగురు అంటున్నారు) సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను దారుణంగా అంతమొందించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని నివిస్తున్న ఒంటరి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడటం ఒక ఎత్తు అయితే.. బాధితురాలి ఒంటిపై కనిపిస్తున్న పళ్ల గాట్లు.. గోళ్లతో రక్కిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదన్న మాటను పోలీసులు చెప్పటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. ఈ దారుణంపై పోలీసుల వెర్షన్ విమర్శలకు తావిచ్చేలా ఉంది. బాధితురాలిని అంతమొందించిన నిందితులు కొర్రపాటి వెంకట సాయి సతీశ్.. మరీదు శివ సత్యం సాయిరాం ఆమె ఇంటికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చేశారని.. తిరిగి వెళ్లిన సత్యసాయిరాం ఆమెపై లైంగికంగా ఒత్తిడి చేస్తే ఒప్పుకోలేదని.. ఆమె లొంగకపోవటంతో చీరె కొంగుతో చుట్టూ బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ దారుణం జరిగిన తర్వాత నిందితులు ఇద్దరు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఇద్దరు తమ అదుపులో ఉన్నట్లు చెబుతుంటే.. గ్రామస్థులు మాత్రం ముగ్గురు ఉన్నారని.. వీరంకి శివరామక్రిష్ణ కూడా నిందితుడితో పాటు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. మూడో నిందితుడిపై పోలీసులు మౌనంగా ఉండటం ఇప్పుడు ఇష్యూగా మారింది.

అయితే.. మూడో వ్యక్తితోపాటు నాలుగో వ్యక్తి కూడా ఘటనాస్థలంలో ఉన్నాడని.. అతడికి తెనాలికి చెందిన వైసీపీ నేతల అండదండలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ ఉదంతం మరింత సంచలనంగా మారింది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేస్తూ తన కొడుకు ముగ్గురు పేర్లు చెబుతుంటే పోలీసులు ఇద్దరి మీదనే కేసులు నమోదు చేయటం.. అది కూడా అనుమానాస్పద మరణంగానే పేర్కొనటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళలపై జరిగే ఘోరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా దిశ యాప్ తీసుకొస్తున్నట్లుగా జగన్ సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటమే కాదు.. దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళలపై హింస జరిగితే గన్ను కంటే జగన్ ముందుగా వస్తారంటూ జరిగిన ప్రచారంపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ వెయ్యి రోజుల పాలనలో 800 మందికి పైనే మహిళలపై దాడులు జరుగుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

తాజా ఉదంతంలో మహిళపై ముగ్గురు దాడి చేశారని బాధిత కుటుంబమే చెబుతుంటే.. ఇద్దరి పేర్లను మాత్రమే ఎఫ్ఐఆర్ లో నమోదు చేయటం ఏమిటి? అన్న ప్రశ్న వినిపిస్తోంది. మహిళలపై జరిగే ఘోరాలపై కఠినంగా వ్యవహరించాల్సింది. కానీ.. అలాంటిదేమీ జగన్ పాలనలో జరగటం లేదన్న మాట ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారటమే కాదు.. ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోంది. గతంలో ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా.. 'గన్ను కంటే జగన్ ముందు వస్తాడు' అన్న మాటను చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది.