Begin typing your search above and press return to search.

ఇంట గెలిచిన లోకేష్... అనూహ్య దీవెనలు...?

By:  Tupaki Desk   |   18 April 2022 8:39 AM GMT
ఇంట గెలిచిన లోకేష్... అనూహ్య దీవెనలు...?
X
నారా లోకేష్ కేరాఫ్ చంద్రబాబు. ఈ రోజుకు కూడా చినబాబు గురించి చెప్పాలీ అంటే అదే అంటారు అంతా. అయితే లోకేష్ ని భావి నాయకుడిగా, టీడీపీని తన భుజాల మీద నడిపించే సమర్ధ నేతగా ముందుకు తీసుకురావాలని తండ్రి చంద్రబాబు బాగా అరాటపడుతున్న సంగతి విధితమే. మరో వైపు ఆయన బాలయ్యకు స్వయాన మేనల్లుడు, అల్లుడు. ఆ విధంగా చూస్తే నందమూరి ఫ్యామిలీ మద్దతు కూడా పూర్తిగానే ఉంది అని చెప్పాలి.

ఇక ఆయన పెద్దమ్మ, బీజేపీలో కీలకనేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు ల మద్దతు ఎటూ అన్న ప్రశ్న అయితే ఇన్నాళ్ళూ ఉంది. ఇపుడు పెద్దమ్మ కూడా కుండబద్ధలు కొట్టేశారు. తన మద్దతు పూర్తిగా లోకేష్ బాబుకే అని మనసారా దీవించేశారు కూడా.

లోకేష్ విషయంలో తన ఆశీర్వాదాలు ఎపుడూ ఉంటాయని కూడా చెప్పుకున్నారు. లోకేష్ తనకంటూ రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు రావాలని కూడా ఆమె కోరుకున్నారు. అదే టైమ్ లో తమ కుమారుడు దగ్గుబాటి హితేష్ రాజకీయాల్లో ప్రస్తుతం లేరని, బిజినెస్ చూసుకుంటున్నాడని ఆమె చెప్పారు.

కుమారుడు రాజకీయాల్లోకి వస్తే రావచ్చు, అది ఆయన ఇష్టమని, ఏ పార్టీలో చేరాలన్నది కూడా హితేష్ సొంత నిర్ణయమని కూడా పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చారు. తన భర్త, కుమారుడు ఇద్దరూ వైసీపీలో లేరని ఆమె అనడం ద్వారా హితేష్ చేరేది ఆ పార్టీలో కాదు అని చెప్పేసినట్లు అయింది.

ఇక మిగిలింది టీడీపీనే. లోకేష్ కి పెద్దమ్మ దీవెనలు ఉన్నపుడు హితేష్ సైకిలెక్కడం కూడా ఖాయమే కదా. అంటే అన్నదమ్ములు ఇద్దరూ ఫ్యూచర్ లో టీడీపీ జెండాకు అండగా ఉంటారన్న మాట. ఈ మేరకు టోటల్ ఫ్యామిలీలో అంతా అవగాహన కుదిరే ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి లోకేష్ కి నందమూరి ఇంట కానీ దగ్గుబాటి ఇంట కానీ ఏ ఇబ్బందులూ లేవు, పైగా ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.

ఇక చినబాబు తన ప్రతాపం చూపించి రచ్చ గెలవాలే కానీ తండ్రి మాదిరిగా మరో మూడు నాలుగు దశాబ్దాలు టీడీపీని, ఏపీనీ ఏలేందుకు సిద్ధమే అని అంటున్నారు అంటే అందులో డౌట్ ఏమీ లేదుగా. సో జయహో లోకేశా. ఇది తాత ఇంటి మాట. నందమూరి ఆడపడుచుల మాట. మరి తెలుగు జనాల మాట కూడా అదే అయితే చంద్రబాబుకు పుత్రోత్సాహం కలగడానికి ఎక్కువ టైమ్ పట్టేది ఉండదేమో.