Begin typing your search above and press return to search.

దావోస్ కి జగన్...లేట్ గా అయినా లేటెస్ట్ గా...?

By:  Tupaki Desk   |   22 April 2022 7:29 AM GMT
దావోస్ కి జగన్...లేట్ గా అయినా లేటెస్ట్ గా...?
X
దావోస్.. ఈ పేరు ఒకపుడు ఏపీలో మారు మోగిపోయింది. ముఖ్యంగా ఏపీ విభజన తరువాత పగ్గాలు చేపట్టిన టీడీపీ ఏలుబడిలో ప్రతీ ఏటా దావోస్ టూర్ ఉండేది. చంద్రబాబు సహా ముఖ్య నేతలు అంతా దావోస్ ని ఎక్కువగా కలవరించేవారు. అక్కడకు ఎక్కువగా వెళ్లి వచ్చేవారు. దావోస్ అంటేనే టీడీపీ జమానా, చంద్రబాబు ఠక్కున గుర్తుకు వస్తారు. ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకువచ్చామని కూడా నాడు చెప్పుకునేవారు.

అయితే దావోస్ టూర్ల వల్ల ఏపీకి ఏమి ఒరిగింది అన్నది ఆరా తీస్తే పెద్దగా లేదనే చెప్పాలి. అంతమాత్రం చేత దావోస్ వెళ్లకూడదని కాదు, దావోస్ వేదికగా ఇక ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఫారం మీద ఏపీ వాణి కచ్చితంగా వినబడాల్సిందే. పెట్టుబడుల వరద పారినా పారకపోయినా ఏపీ గురించి చాలా మందికి తెలిసే అవకాశం ఉన్న వేదిక అది.

అలాంటి దావోస్ వైసీపీ ఏలుబడిలో మాత్రం పెద్దగా వినిపించడంలేదు. దానికంటే ముందు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ కూడా కరోనా కారణంగా ప్రత్యక్షంగా జరగడంలేదు. గత రెండేళ్ళుగా వర్చువల్ విధానంలోనే జరిగాయి. ఈసారి కరోనా కాస్తా తగ్గడంతో దావోస్ వేదికగా మరోమారు అంతా కలవనున్నారు.

ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఇప్పటికే ఏపీ సర్కార్ కి ఆహ్వానం అందింది. నిజానికి గత డిసెంబర్ లో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీట్ ఉంది. కానీ అప్పటికి కరోనా ప్రభావం ఉండడంతో వాయిదా వేసుకున్నారు. ఈసారి మాత్రం కచ్చితంగా జరగనుంది. మే నెలలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి సంబంధించి ఏపీ సర్కార్ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది.

ఇక ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఫస్ట్ టైమ్ దావోస్ లో పర్యటించనున్నారు. మే 22న ఆయన దావోస్ చేరుకుంటారు. వారం రోజుల పాటు ఆయన అక్కడ ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో ఆయన మాట్లాడుతారు. చాలా మంది పారిశ్రామికవేత్తలను ఆయన కలుసుకుంటారని అంటున్నారు.

ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చే బృహత్తర లక్ష్యాన్ని సాధించడానికి జగన్ రెడీ అవుతున్నారు. స్వతహాగా బిజినెస్ మాన్ అయిన జగన్ రంగంలోకి దిగితున్నారు. మరి జగన్ దావోస్ టూర్ మీద అపుడే ఆసక్తి కలుగుతోంది. ఆయన ఏ రకంగా పెట్టుబడులు సాధిస్తారు. ఏపీ పారిశ్రామిక పాలసీ గురించి అంతర్జాతీయ వేదిక మీద ఎలా చెప్పి ఒప్పిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే రానున్న రెండేళ్లూ వైసీపీకి అత్యంత కీలకం కాబట్టి జగన్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తారు అని అంటున్నారు. ఏపీకి పెట్టుబడులు రావడంలేదు అన్న మచ్చను తొలగించుకోవాలన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉంది. ఇంతకాలం పరిశ్రమల‌ శాఖ మంత్రిగా గౌతం రెడ్డి ఉండేవారు. ఆయన మీద భారం అంతా పెట్టి జగన్ తాడేపల్లికే పూర్తిగా పరిమితం అయ్యారు.

ఇపుడు ఆ శాఖను యువకుడు అయిన గుడివాడ అమరనాధ్ కి ఇచ్చారు. ఆయన వంతు ఆయన చేస్తారు. దాంతో పాటుగా సీఎం గా జగన్ కూడా జోక్యం చేసుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి లేట్ గా అయినా లేటెస్ట్ గానే జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి వాటి ఫలితాలు కనుక ఏపీకి వస్తే రాష్ట్రం ఎంతో కొంత బాగుపడుతుంది. మొత్తానికి జగన్ దావోస్ ట్రిప్ అటు రాజకీయంగా ఇటు పారిశ్రామికంగా కూడా చర్చగానే ఉంది.