Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర తర్వాత నెక్ట్స్ ఆ రాష్ట్రమే.. జార్ఖండ్ సీఎం ఇంటిపై ఈడీ దాడి

By:  Tupaki Desk   |   8 July 2022 2:39 PM GMT
మహారాష్ట్ర తర్వాత నెక్ట్స్ ఆ రాష్ట్రమే.. జార్ఖండ్ సీఎం ఇంటిపై ఈడీ దాడి
X
కేంద్రంలో అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు.. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చవచ్చు. ప్రత్యర్థులను ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థలతో బెదిరించవచ్చు. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ చేస్తున్నది అదేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను సాంతం వాడేస్తోందన్న ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలోని శివ సేన ఎమ్మెల్యేలపై ఈడీ దాడులతో దారికి తెచ్చుకున్నారని టాక్ నడిచింది. ఇప్పుడు మహారాష్ట్రలో విజయవంతంగా శివసేనను దించి బీజేపీని గద్దెనెక్కించిన బీజేపీ సర్కార్ ఇదే సంకీర్ణ సర్కార్ తో సంసారం చేస్తున్న జార్ఖండ్ లోనూ కూల్చడానికి రెడీ అయినట్లు సమాచారం.

జార్ఖండ్ లో ఇప్పుడు కాంగ్రెస్, జేఎంఎం పొత్తుల సంసారంలో నడుస్తోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తో జతకట్టిన సోరెన్ ను ఎలాగైనా గద్దెదించాలని.. లేదంటే బీజేపీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలని బీజేపీ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.

అప్పట్లో కేంద్రాన్ని.. మోడీని సూటిగా కడిగిపారేశాడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం విధానాలు రాష్ట్రాలకు ఇబ్బందిగా మారాయని ఆరోపించారు. తమ రాష్ట్రానికి ఉచితంగా కరోనా టీకాలు పంపించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కొనుగోలు తమకు తలకు మించిన భారమవుతోందని వాపోయారు. రాష్ట్రానికి అందుతున్న టీకాలు ఏమాత్రం సరిపోవడం లేదని.. కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదని సోరెన్ ఆరోపించారు. కరోనా వల్ల జార్ఖండ్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. టీకాలు ఉచితంగా అందజేయాలని సోరెన్ విజ్ఞప్తి చేశారు. కరోనాతో విలవిలలాడుతున్న ఈ సమయంలో టీకాల సేకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించి మోడీకి షాకిచ్చారు.

ఆది నుంచి మోడీకి వ్యతిరేకంగానే హేమంత్ సోరెన్ రాజకీయాలు చేస్తున్నారు. మోడీకి కొరకరాని కొయ్యగా హేమంత్ మారాడు. అందుకే వ్యూహాత్మకంగా జార్ఖండ్ లోని జేఎంఎం-కాంగ్రెస్ కూటమిపై బీజేపీ ఫోకస్ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈడీ తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ ఇంటిపై దాడులు చేయడం సంచలనమైంది.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తోపాటు ఆయన సన్నిహితులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. టెండర్ స్కాంపై ఆరోపణలు వచ్చాయని.. ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. గతంలో సోరెన్ పై మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులోనూ ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరుపుతోంది.

ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ బలపరిచిన ముర్మకే హేమంత్ మద్దతు ఇచ్చారు. అయినా కూడా బీజేపీ ఆయనను టార్గెట్ చేయడం విశేషం. బహుశా ఈ దాడులతో హేమంత్ ను కలుపుకొని జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.