Begin typing your search above and press return to search.

వారిని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Oct 2019 5:33 AM GMT
వారిని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టిన కేసీఆర్
X
అంచనాలకు అందని రీతిలో వ్యవహరించటం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది. కమ్యూనిస్టు రాష్ట్రస్థాయి నేతలు తనను కలిసేందుకు వచ్చినప్పుడు.. వారిని గంటల కొద్దీ వెయిట్ చేయించి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిప్పి పంపిన వైనం అప్పట్లో సంచలనంగానే కాదు.. కామ్రేడ్స్ కు తల కొట్టేసినట్లైంది.

ఒక ముఖ్యమంత్రిని తాము అపాయింట్ మెంట్ అడిగితే.. ఇవ్వకపోవటం తర్వాత.. ఇంతలా ఇన్ని గంటలు ఎప్పుడూ.. ఎవరూ వెయిట్ చేయించలేదని వాపోయారు. అంతకంతకూ బదులు తీర్చుకుంటామని చెప్పారు. కట్ చేస్తే.. తాజాగా జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తమకు మద్దతుగా నిలవాలని సీపీఐ నేతల్ని కేసీఆర్ అడిగినంతనే.. వారు ఒప్పేసుకోవటం కనిపిస్తుంది.

తాను ఎవరినైతే కలవటానికి సైతం ఇష్టపడలేదో.. వెయిట్ చేయించి మరీ తిప్పి పంపానో.. వారితోనే మద్దతుకు ఓకే అనేలా చేయించుకోవటం కేసీఆర్ టాలెంట్ గా చెప్పాలి. ఊహించని రీతిలో పెరిగి పెద్దదైన ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్ తీరు అనూహ్యంగా ఉండటమే కాదు ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీలో ఉన్న 48 వేల మంది ఉద్యోగాలు పోయినట్లేనని తేల్చేసిన కేసీఆర్.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటానని దూకుడుగా ముందుకెళ్లిపోయారు.

అయితే.. తాను అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి ముందు.. చట్టం.. కోర్టులు లాంటి చాలానే ఉంటాయన్న విషయం ఆయనకు గుర్తుకు వచ్చిందేమో కానీ.. ఇప్పుడు ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక కిందామీదా పడుతున్నారు. ఇదే సమయంలో.. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచేందుకు పలు సంఘాల వారు సిద్ధమవుతున్న వేళ.. ఊహించని ఎత్తు వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు కేసీఆర్.

తాజాగా టీఎన్జీవో నేతలకు ప్రగతిభవన్ కు రావాలన్న సందేశం రావటంతో వారు పెద్ద ఎత్తున వెళ్లారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ అమలు గురించి హామీ ఇచ్చేశారు. ప్రస్తుతం హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో.. అది పూర్తి అయిన వెంటనే కూర్చుందామన్న కేసీఆర్.. తన నివాసానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు ఊహించని రీతీలో వ్యవహరించి వారిని ఆశ్చర్యానికి గురి చేశారు.

వారితో కలిసి భోజనం చేయటంతో పాటు.. తన దగ్గరున్న మంత్రులకు వారిని పరిచయం చేశారు. ఉద్యోగ సంఘాల నేతల్ని పేరు పేరునా పరిచయం చేస్తూ.. ఎప్పుడు వారొచ్చినా పనులు వెంటనే పూర్తి చేసి పంపాలన్న మాటను చెప్పేశారు. ఇలా ఇంటికి పిలిచి భోజనం పెట్టి.. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తానన్న సంకేతాల్ని ఇవ్వటమే కాదు.. మంత్రులకు పనులు వెంటనే పూర్తి చేయాలన్న రికమండేషన్ చూసినప్పుడు.. విభజించు పాలించు సూత్రాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న వైనం కనిపించక మానదు. ఆర్టీసీ కార్మికులతో కలవకుండా ఉండేందుకు వీలుగా.. టీఎన్జీవోలను విందుతో కట్టడి చేశారన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ తాజా తీరుకు టీఎన్జీవో నేతలు ఎలా రియాక్ట్ అవుతారో కాలమే సమాధానం చెప్పాలి.