Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి మ‌ళ్లీ అదే స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   9 Dec 2015 3:53 PM GMT
అమ‌రావ‌తికి మ‌ళ్లీ అదే స‌మ‌స్య‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చిప‌డింది. శంకుస్థాప‌న జ‌రిగి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తున్నా ప‌నులు మొద‌లుపెట్ట‌ట్లేద‌నే అపప్ర‌ద ఉండ‌గా...ఇపుడు న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణంలో ఆదేశాల‌ను ఉల్లంఘించంచార‌ని పేర్కొంటూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యునల్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాజధాని అమ‌రావ‌తి ప‌నుల ప్రారంభం నుంచి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ లో పేచీ మొద‌ల‌యింది. రాజ‌ధాని ప‌నుల్లో భాగంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసిన‌ త‌ర్వాతే నిర్మాణ ప‌నులు చేప‌ట్టాలని నిబంధ‌న‌లో ఉంది. అయితే శంకుస్థాప‌న ప‌నుల్లో భాగంగా హ‌డావుడిగా ప‌నులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల అర‌టితోట‌లు తొల‌గించారు. శంకుస్థాపన ప్రక్రియలో బాగంగా తమ తుది తీర్పు వెలువడేవరకు ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని అక్టోబ‌ర్ 10న పర్యావరణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన వెంటనే రాజధాని గ్రామాల్లో పర్యటించిన శ్రీమన్నారాయణ అనే పర్యావరణవేత్త‌ అనుమతులు లభించలేదని ప్రచారం చేశారు. అయిన‌ప్ప‌టికీ హ‌డావుడిగా ప‌నులు పూర్తి కావ‌డంతో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ చేతుల మీదుగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం పూర్త‌యిపోయింది.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ఫిర్యాదుదారుడు మ‌ళ్లీ ట్రిబ్యున‌ల్‌ ను ఆశ్రయించి ఏపీ ప్ర‌భుత్వం కోర్టు దిక్కారానికి పాల్ప‌డ్డార‌ని నివేదించారు. దీంతో సుదీర్ఘ‌వాద‌న‌లు విన్న‌త‌ర్వాత ట్రిబ్యునల్ వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఏపీ ప్ర‌భుత్వం స‌హా రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ( సీఆర్‌ డీఏ), ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఆ వ‌ర్గాలు త‌మ వాద‌న‌లు వినిపిస్తూ... రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఏపీ ప్ర‌భుత్వ‌ వాదనల‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. అమరావతిపై దాఖలైన కేసును నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో సంక్రాంతి నుంచి వేగిరం చేయాల‌నుకున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప‌నుల‌పై అనుమాన మేఘాలు క‌మ్ముకున్నాయి.