Begin typing your search above and press return to search.

పాత‌బ‌స్తీలో క‌ల‌క‌లం..8మంది టెర్ర‌రిస్టుల అరెస్ట్‌

By:  Tupaki Desk   |   7 Aug 2018 5:52 AM GMT
పాత‌బ‌స్తీలో క‌ల‌క‌లం..8మంది టెర్ర‌రిస్టుల అరెస్ట్‌
X
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. జాతీయ ఉగ్రవాద నిరోధక నిఘా విభాగం ఎన్ఐఏకు చెందిన ప్రత్యేక టీమ్‌ లు సోమవారం ఉదయం పాతబస్తీలో దాడులు నిర్వహించి లష్కర్‌-ఎ-తోయిబా(ఎల్ ఈటీ) ఉగ్రవాద సంస్థ కు చెందిన అనుమానితులుగా భావిస్తున్న ఏడుగురిని అదు పులోకి తీసుకున్నాయి. ఇందులో ఒక మత ప్రబోధకుడు కూడా ఉన్నాడని తెలిసింది.రెండు రోజుల క్రితమే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున జైషే మహ్మద్‌ కు చెందిన ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా సంస్థ ఐబీ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎల్ ఈటీకి చెందిన ఉగ్రవాది ఢిల్లీలో అరెస్టు కావడం - అతని నుంచి సేకరించిన సమాచారంతో హైదరాబాద్‌ - భూపాల్‌ పల్లిలో ఎన్ ఐఏ దాడులు జరిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పంద్రాగస్టుకు ఉగ్రవాద ముప్పు తప్పినట్టేనని పోలీసు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఒడిషా రాష్ట్రం కేంద్ర పారా ప్రాంతానికి చెందిన హబీబూర్‌ రహ్మాన్‌ కు ఐదేళ్ల‌ క్రితం పాకిస్తాన్‌ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ లష్కర్‌-ఎ-తోయిబాతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఎల్ఈటీతో సంబంధాలు ఏర్పడ్డాక సౌదీఅరేబియా రాజధాని రియాద్‌ లో ఉంటూ అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ముఖ్యంగా లష్కర్‌ కు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాది షేక్‌ అబ్దుల్‌ నయీమ్‌ అలియాస్‌ న్వామికి సమీప అనుచరుడుగా రహ్మాన్‌ పనిచేసేవాడు. ముఖ్యంగా భారత్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఏయే ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి, వీఐపీల కదలికలు ఎక్కడ బాగా సాగుతుంటాయి - విద్వంసాలు జరుపాల్సిన ప్రముఖ ప్రదేశాలు ఏవీ - అక్కడ తమకు చర్య జరిపి పారిపోవడానికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి వంటి తదితర సమాచారాన్ని సేకరించి న్వామికి అందచేయడం రహ్మాన్‌ విధి. ఇందుకు అవసరమైన ఆదేశాలు పాకిస్తాన్‌ లో ఉన్న ఎల్ ఈటీ కమాండర్‌ అంజద్‌ నుంచి వీరికి అందేవి. కాగా 2007లో దేశంలో విధ్వంసాలు జరుపడానికిగాను ఇద్దరు పాకిస్తానీలు - ఒక కాశ్మీరీ ఉగ్రవాదిని దేశంలోకి రహస్యంగా తీసుకు వస్తున్న సందర్భంలోనే ఎన్ఐఏకు న్వామి పట్టుబడ్డాడు. దాదాపు ఏడేండ్లు జైలులో ఉన్న న్వామి 2014లో మహారాష్ట్ర నుంచి కోల్‌ కొత్తాకు కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తప్పించుకున్నాడు. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేశాడు. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ - ఛండీగఢ్‌ ప్రాంతాలను షెల్టర్‌ గా చేసుకుని విధ్వంసాలకు వ్యూహరచన చేశాడు. ఇందుకు అవసరమైన నిధులను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ) నుంచి అందేలా ఏర్పాటు చేసుకున్నాడు. కాగా 2017 నవంబర్‌ లో తిరిగి న్వామిని అరెస్టు చేయడంలో ఎన్ ఐఏ అధికారులు విజయవంతమయ్యారు. న్వామితో పాటు మరో ఎనిమిది మందిపై ఎన్ ఐఏ అధికారులు ఆ సమయంలో కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌లో హబీబూర్‌ రహ్మాన్‌ పేరు కూడా ఉంది. తాజాగా ఢిల్లీలో అరెస్టు చేసిన రహ్మాన్‌ ను ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచిన ఎన్ ఐఏ అధికారులు తీహార్‌ జైలుకు తరలించారు. మరో సారి రహ్మాన్‌ ను విచారించడానికి కోర్టులో కస్డడీ పిటీషన్‌ ను వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రహ్మాన్‌ ద్వారా ఎల్ ఈటీ కోసం పని చేస్తున్న మరికొందరి సమాచారాన్ని ఎన్ ఐఏ రాబట్టినట్టు తెలిసింది. పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు నగరంలోని పహాడీ షరీఫ్‌ - షాహిన్‌ నగర్‌ - భూపాల్‌ పల్లిలలో కొన్ని ఇళ్ల‌పై దాడులను నిర్వహించాయి

బాలాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని షాహీన్‌ నగర్ - పహాడిషరీఫ్ ప్రాంతాల్లో ఎన్ ఐఏ అధికారులు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న ఏడుగురి ఇళ్ల‌ల్లో తనిఖీలు నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ తనిఖీల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సామగ్రితోపాటు పలు కీలక పత్రాలను ఎన్ఐఏ అధికారులు జప్తుచేశారు. ఈ దర్యాప్తు 2016 సంవత్సరంలో ఢిల్లీలో నమోదైన కేసుకు సంబంధించిందని ఎన్ ఐఏ అధికారులు స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీ కోర్టు అనుమతితో షాహీన్‌ నగర్‌ లోని అబ్దుల్ ఖదీర్ ఇంటితోపాటు మరో ఆరుగురు నివాసాల్లో సోదాలు జరిపారు. సోదాల సమయాల్లో ఖదీర్ ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది. అతనికి సంబంధించిన ల్యాప్‌ టాప్ - స్మార్ట్‌ ఫోన్లను జల్లెడ పట్టారు. అతనికి 41 సీఆర్‌ పీసీ కింద నోటీసు జారీ చేసి మంగళవారం హైదరాబాద్ ఎన్ ఐఏ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. 2016లో ఢిల్లీలో నమోదైన కేసులోని ప్రధాన నిందితులతో నగరానికి చెందిన కొంత మంది యువత సోషల్ మీడియాలో చాటింగ్ చేయడంతోపాటు ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించినట్టు ఎన్ ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు 2015 లో ఓ సందర్భంలో ఐసిస్‌ లో చేరేందుకు ప్రయత్నించి కోల్‌ కతా ప్రాంతంలో దొరికిపోయారు. అప్పట్లో వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ పోలీసులకు అప్పజెప్పడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్చేందుకు ప్రయత్నించారు. తాజాగా వీరు తిరిగి ఐసిస్ భావజాల వ్యాప్తికి మొగ్గు చూపుతున్నారనే ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో వారిపై దృష్టి సారించిన ఎన్ఐఏ అధికారులు పలు పక్కా ఆధారాలు సేకరించి కోర్టు అనుమతితో సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖదీర్ ఇంట్లో కొంత కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఖదీర్ తండ్రి ఖుద్దూస్ మాట్లాడుతూ ఎన్ ఐఏ అధికారులు తెల్లవారుజాము నుంచి తమ ఇంట్లో సోదాలు జరిపారని - వారికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తన కొడుకు ఖదీర్ ఎలాంటి తప్పుచేయలేదన్నారు. ఎన్ ఐఏ సోదాల సందర్భంగా రాచకొండ ఎస్‌ వోటీ - బాలాపూర్ పోలీసులు షాహీన్‌ నగర్ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ ఐఏ సోదాలపై స్థానిక స్పెషల్ బ్రాంచి - నిఘా వర్గాలు ఆరా తీశాయి.