Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌పై ఎన్ ఐఏ విస్తృత సోదాలు.. ఉగ్ర‌వాద శిక్ష‌ణే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   18 Sep 2022 8:30 AM GMT
తెలుగు రాష్ట్రాల‌పై ఎన్ ఐఏ విస్తృత సోదాలు.. ఉగ్ర‌వాద శిక్ష‌ణే కార‌ణ‌మా?
X
రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్ఐఏ పంజా విసిరింది. ఆదివారం తెల‌తెల వారుతూనే.. అధికారులు వాలిపోయారు. ప‌లు జిల్లాల్లో విస్తృత త‌నిఖీలు చేస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా - పీఎఫ్ఐ కేసులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఉగ్ర‌వాద ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని భావిస్తున్న‌ట్టు ఎన్ ఐఏ అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే దర్యాప్తును వేగవంతం చేశారు. తెలంగాణ‌లోని నిజామాబాద్, నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల పట్టణంలో సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. అదేవిధంగా ఏపీలోని నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు.

పీఎఫ్ ఐ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీ లు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు నిర్మల్ జిల్లా భైంసాలో కూడా ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. భైంసాలోని మదీనా కాలనీలోని పలు ఇళ్లలో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెల్లవారుజామున నిజామాబాద్లో దాడుల అనంతరం మరో టీమ్ జగిత్యాల చేరుకుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ముందుగా టవర్ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్ షాప్కు వచ్చి దుకాణం తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని సీసీ ఫుటేజిని పరిశీలించారు. వాటి సాయంతో మరికొంద రి ఇళ్లలో సోదాలు జరిపారు. అనుమానితుల ఇళ్లలో అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసు కున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐ పేరులో ఓ సంస్థ కార్యకలాపాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ పేరుతో వీరికి సంఘవిద్రోహ కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్ఐఏకి అప్పగించారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో ఎన్ ఐ ఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాస్‌తో పాటు మిత్రుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల కోసం వచ్చిన అధికారులను... ఇలియాజ్‌ బంధువులు, సహచరులు చాలాసేపు అడ్డుకున్నారు. సోదాలు చేయడానికి వీల్లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. క‌ర్నూలులోనూ.. సోదాలు జ‌రుగుతున్నాయి.