Begin typing your search above and press return to search.

బాబూ..ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:17 AM GMT
బాబూ..ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రెండు నెలల కిందట సెప్టెంబర్ 23న అరకు ఎంఎల్ ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ ఐఏ) విచారణకు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కిడారి కేసుతో పాటు జగన్‌ పై హత్యాయత్నం కేసును కూడా కేంద్ర సంస్థలు విచారణకు తీసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కిడారి కేసును కేంద్రం విచారణ చేపట్టనుండంతో చంద్రబాబులో భయం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ కేసుతో పెద్ద ఇబ్బందేమీ లేకపోయినా విమానాశ్రయంలో జగన్‌ పై జరిగిన దాడి కేసు విచారణకు తీసుకుంటే మాత్రం తమ బండారాలు బయటపడతాయని చంద్రబాబు - టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లు టాక్.

సెప్టెంబరు నెలలో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి స్ధానికుల ఎదుటే కిడారిని - మాజీ ఎంఎల్ ఏ సివేరి సోమాలను కాల్చి చంపారు. మావోయిస్టుల హత్యకు సహకరించిన స్ధానిక టిడిపి నేతలను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిడారిని తామే హత్య చేసినట్లు మావోయిస్టులు కూడా ప్రకటించుకున్నారు. అయినా - ఈ కేసును ఎన్ఐఏ తీసకుంది. అలాంటప్పుడు దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవడం తప్ప ఇంకేమీ ముందుకు సాగని జగన్‌ పై హత్యాయత్నం కేసును కేంద్రం ఎందుకు విడిచిపెడుతుందన్న ప్రశ్న వినిపిస్తుంది. పైగా అది తమ పరిధిలోని విమానాశ్రయంలో జరిగింది కూడా.

దాడిలో గాయపడిన జగన్ థర్డ్ పార్టీ విచారణ జరపాలని కోర్టునాశ్రయించారు. హత్యాయత్నం కేసులో సిట్ విచారణ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ - కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను కనీసం విచారణకు కూడా పిలవలేదు. దీంతో ఈ కేసు ద్వారా చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు బీజేపీ ముందుకు కదిలే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఓటుకు నోటు కేసూ మళ్లీ లైమ్ లైట్లోకి రానుందట.. ఇవన్నీ జరిగితే చంద్రబాబుకు ముందుంది ముసళ్ల పండగే.