Begin typing your search above and press return to search.

ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   1 Aug 2022 5:34 AM GMT
ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. కార‌ణ‌మిదే!
X
భారత్‌లో ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు చేయడం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌.. ఐసిస్‌ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ 8 రాష్ట్రాల్లో దాడులు చేసింద‌ని తెలుస్తోంది. 8 రాష్ట్రాల్లో మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. స్థానికులకు ఉగ్ర‌వాద సంస్థ‌ ఐసిస్‌తో ఉగ్ర లింకులపై ఆరా తీసింది.

మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి డాక్యుమెంట్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రైసెన్ జిల్లాలు; గుజరాత్‌లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాలు; బీహార్‌లోని అరారియా జిల్లా; కర్ణాటకలోని భత్కల్, తుంకూర్ సిటీ జిల్లాలు; మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్ జిల్లాలు; ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్ జిల్లాల్లో సోదాలు నిర్వ‌హించారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని దేవ్‌బంద్‌లోని ఓ మదర్సాలో కర్ణాటకకు చెందిన ఫరూక్‌ అనే విద్యార్థిని ప్రశ్నించారు. ఉగ్ర సంబంధాల ఆరోపణలపై కర్ణాటకలో ఇద్దరిని, తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో ఒకరిని అదుపులోకి తీసుకుంది. వీరిపై ఐపీసీలోని ప‌లు సెక్ష‌న్లు, ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టంలోని ప‌లు సెక్ష‌న్ల కింద జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారులు కేసులు న‌మోదు చేశారు.

రెండు వేర్వేరు ఇస్లామిక్ స్టేట్ సంబంధిత కేసుల‌కు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. నిందితుల‌కు ఉగ్ర‌వాద సంస్థ‌తో సంబంధాలు ఉన్న‌ట్టు నిరూపించే ప‌లు ఆధారాలు, మెటీరియ‌ల్, డాక్యుమెంట్ల‌ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

సాథిక్ అరెస్టుకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ కేరళలోని త్రివేండ్రం జిల్లాలో సోదాలు నిర్వహించింది. దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్ర ప‌న్నుతోంద‌ని ఎన్ఐఏ విశ్వసిస్తోంది. ఈ క్ర‌మంలో 8 రాష్ట్రాల్లో సోదాల‌కు దిగింది.

అలాగే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలు సిరియా, పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారని క‌ర్ణాట‌క‌కు చెందిన‌ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ఆరోపించారు. బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టార్‌ను పీఎఫ్‌ఐయే హత్య చేసిందన్నారు. ఈ కేసు విచారణ కోసం కూడా ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది.