Begin typing your search above and press return to search.

ట్వీట్ ఎఫెక్ట్‌.. ఆమెపై బ‌దిలీ వేటు వేశారు!

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:23 AM GMT
ట్వీట్ ఎఫెక్ట్‌.. ఆమెపై బ‌దిలీ వేటు వేశారు!
X
బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న వారెంత‌ బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తార‌న్న దానికి ఉదాహ‌ర‌ణ‌గా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారిణి తీరును చెప్పొచ్చు. జాతిపిత మ‌హాత్మా గాంధీపై వివాదాస్ప‌ద ట్వీట్ చేసిన ఆమెపై వేటు ప‌డింది. ఇటీవ‌ల కాలంలో గాంధీ మీద చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో.. అలాంటి వారిని వ్యంగ్యంగా ఎట‌కారం ఆడేందుకే తాను ట్వీట్ చేసిన‌ట్లుగా ఆమె చేస్తున్న వాద‌న‌ను ఎవ‌రూ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేదు.

మ‌హాత్మాగాంధీని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తీవ్ర దుమారంగా మారిన ఆమె ట్వీట్ ను చూస్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హాత్మాగాంధీ విగ్ర‌హాల‌ను కూల్చేయాలి. కార్యాల‌యాల్లో చిత్ర‌ప‌టాల‌ను తొల‌గించాలి. క‌రెన్సీ నోట్ల‌పై ఆయ‌న ఫోటో తీసేయాలి. గాంధీజీని హ‌త్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ బీఎంసీ డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ నిధి చౌద‌రి చేసిన ట్వీట్ పెనుదుమారంగా మారిన సంగ‌తి తెలిసిందే.

తాను కావాల‌నే ఆ ట్వీట్ చేశాన‌ని.. ఇటీవ‌ల గాంధీని విమ‌ర్శిస్తూ సోష‌ల్ మీడియాలో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా స్పందించ‌టంలో తాను ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశాన‌న్నారు. అయితే.. ఆమె వాద‌న‌ను ప్ర‌భుత్వం ఏకీభ‌వించ‌లేదు. ఆమెపై పెల్లుబుకుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెను బీఎంసీ ఆఫీసు నుంచి నీటి స‌ర‌ఫ‌రా.. పారిశుద్ధ్య విభాగానికి బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టం త‌ప్పు కాదు కానీ.. దాని ఉద్దేశం అర్థమ‌య్యే విష‌యంలో పొర‌పాటు దొర్లితే ఈ త‌ర‌హా మూల్యాన్ని చెల్లించక త‌ప్ప‌దన్న విష‌యం నిధి చౌద‌రికి ఇప్ప‌టికైనా అర్థ‌మై ఉంటుందా?