Begin typing your search above and press return to search.

కటువుగా వ్యవహరించిన మౌన సింగ్?

By:  Tupaki Desk   |   15 July 2015 5:46 AM GMT
కటువుగా వ్యవహరించిన మౌన సింగ్?
X
పదేళ్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించినప్పటికీ.. పట్టుమని పదిసార్లు కూడా దేశ ప్రజలను ఉద్దేశించి.. తనకు తానుగా స్వేచ్ఛగా.. సొంతంగా ప్రసంగించింది లేదు. వీలైనంతవరకూ మౌనంగా ఉంటూ..తన పని తాను చేసుకుపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనపై చాలానే విమర్శలు ఉన్నాయి. సహజంగానే సౌమ్యుడైన ఆయన.. కిలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒత్తిళ్లకు లొంగేవారని.. రిమోట్ లా వ్యవహరించేవారన్న విమర్శ ఉంది. అయితే.. ఇందులో కొంతమాత్రమే నిజం ఉందన్నట్లుగా తాజాగా ఒక ఉదంతం వెలుగు చూసింది.

సౌమ్యంగా ఉంటూ.. పెద్దగా మాట్లాడని ఈ మౌన ప్రధాని.. ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాకే షాక్ ఇచ్చారన్న ఆసక్తికరమైన విషయం తాజాగా బయటకు వచ్చింది. 2005 జులై 18న భారత్.. అమెరికా మధ్య అణు ఒప్పందాన్ని ప్రకటించటానికి ముందు రోజు.. ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాల్ని పంపి.. అమెరికాకు షాకిచ్చారని చెబుతున్నారు.

అణుఒప్పందాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నందుకే అణు ఒప్పందాన్ని మన్మోహన్ సింగ్ రద్దు చేసుకోవాలని భావించినట్లుగా కండోలిజా రైస్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై నాటి జాతీయ భద్రతా సలహాదారు నారాయణ్ స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా.. అంటూ అసలు గుట్టు విప్పి చెప్పుకొచ్చారు.

‘‘అణుఒప్పందానికి సంబంధించి కీలకమైన అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల వెలుపల ఉంచాల్సిన అణు రియాక్టర్ల సంఖ్యపై భారత ప్రధాని కార్యాలయానికి.. అమెరికా అధ్యక్ష కార్యాలయానికి మధ్య ఒక అవగాహన కుదిరింది. దీని ప్రకారం అణు రియాక్టర్ల సంఖ్య ఆరు నుంచి ఎనిమిది మధ్య ఉండాలి. కానీ.. అమెరికా విదేశాంగ శాఖ భారత్ కు గుణ పాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఒప్పందం జరగటానికి ముందు రోజు రాత్రి.. ఆ సంఖ్యను రెండుకు కుదించారు. దీంతో.. ఒప్పందం జరగటానికి ముందు రోజు అర్థరాత్రి 12.05 గంటల సమయంలో ఒప్పందాన్ని రద్దు చేసుకుందామని మన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. ఊహించని ఈ పరిణామం అమెరికాకు భారీ షాక్ ను ఇచ్చింది. వెంటనే నాటి అధ్యక్షుడు జార్జి బుష్ సీన్లోకి వచ్చి.. కండోలిజా రైస్ ను మన్మోహన్ బస చేసిన హోటల్ కు పంపారు. అయితే.. ఆమెను కలవటానికి మన్మోహన్ ఇష్టపడలేదు. చివరకు నాటి విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ ను కలిసి.. ఆయన సాయంతో ప్రధానిని నేరుగా కలిసి.. భారత్ కు ఆమోదయోగ్యమైన అణు రియాక్టర్ల సంఖ్యకు ఓకే చెప్పాకే.. మన్మోహన్ అణు ఒప్పందం మీద సంతకం చేయటానికి అంగీకరించారు’’ అని చెప్పుకొచ్చారు. మౌనంగా ఉంటూ.. మితంగా మాట్లాడినా.. కీలకమైన సమయాల్లో మన్మోహన్ కటువుగానే వ్యవహరించారన్న మాట.