Begin typing your search above and press return to search.

ఏపీలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టేశారు.. తెలంగాణలో ఉండదా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 3:35 AM GMT
ఏపీలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టేశారు.. తెలంగాణలో ఉండదా?
X
మూడో వేవ్ ముంచుకొస్తున్న వేళ.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. కొందరు వారాంతం రెండు రోజులు కర్ప్యూ విధిస్తే.. మరికొన్ని రాష్ట్రాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూను విధించటం తెలిసిందే. మొత్తంగా పెరుగుతున్న కరోనా కేసుల బారిన తమ రాష్ట్ర ప్రజలు పడకూడదన్న ఆత్రుత వారి నిర్ణయాల్లో కనిపిస్తోంది. ఇలా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

గతానికి వెళితే.. మొదటి వేవ్ సందర్భంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటానికి ఒక రోజు ముందు నుంచే లాక్ డౌన్ విధించటం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని గొప్పగా చెప్పుకున్న సీఎం కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ.. వారాంతం కర్ఫ్యూలను విధిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తూ ఆదేశాల్ని జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం చూస్తే.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్ని జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సినిమా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని.. మాస్కు తప్పనిసరి చేస్తూ ఆదేశాల్ని జారీ చేశారు. దేశ వ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న వేళ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో మార్పు చేయాలసిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచన చేసినట్లుగా పేర్కొన్నారు. హోం కిట్ ను సైతం మార్పులు చేయాలని.. అవసరమైన మందులకు సంబంధించిన కిట్ లను సిద్ధం చేయాలని ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మందుల నిల్వలపై సమీక్ష చేయాలని.. అవసరమైన వాటిని కొనుగోలు చేసి.. సిద్ధంగా ఉంచాలని కోరారు.

మూడో వేవ్ వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియాక్టు అవుతున్న తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటివరకు నైట్ కర్ఫ్యూ మీద నిర్ణయం తీసుకునే విషయంలోనూ.. వారాంతంలో కర్ఫ్యూతో పాటు.. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించాలన్న దానిపైనా సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం గమనార్ం. ఎందుకిలా? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.