Begin typing your search above and press return to search.

టీ-క‌ర్ఫ్యూ: త‌న దాకా వ‌స్తేకానీ.. కేసీఆర్ దిగిరాలేదా?

By:  Tupaki Desk   |   20 April 2021 9:44 AM GMT
టీ-క‌ర్ఫ్యూ: త‌న దాకా వ‌స్తేకానీ.. కేసీఆర్ దిగిరాలేదా?
X
తెలంగాణ‌లో క‌రోనా రెండో ద‌శ తీవ్రత భారీగా ఉన్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 30 అంటే.. మే 1 తెల్ల‌వారు జాము వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అది కూడా రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో కొన్ని అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హాయించి.. మిగిలిన జ‌న‌సంచారంపై ఆంక్ష‌లు విధించ‌డం ద్వారా క‌రొనాకు చెక్ ప‌ట్టాల‌ని కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఇప్పుడు క‌ర్ఫ్యూను ఏర్పాటు చేయ‌డం ద్వారా కేసీఆర్ ప్ర‌భుత్వం క్రెడిట్ కొట్టే ప‌రిస్థితి లేకుండా పోయింది. ``క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు మేం విలువ ఇచ్చాం.. అందుకే ఎన్నికష్టాలు ఎదురైనా .. కూడా రాత్రి పూట క‌ర్ఫ్యూను విధించాం.. ఇది మాకు తెలంగాణ ప్ర‌జ‌ల ప‌ట్ల ఉన్న నిబద్ధ‌త!`` అని మున్ముం దు చెప్పుకొనే ప‌రిస్థితి ఇప్పుడు కేసీఆర్‌కు కానీ, ఆయ‌న మంత్రుల‌కు కానీ లేకుండా పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇదేదో.. ఉదారంగానో.. ముంద‌స్తు వ్యూహంతోనే కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం కాక‌పోవ‌డమే.. ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు.. నెటిజ‌న్లు కూడా సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఆది నుంచి కూడా క‌రోనా రెండో ద‌శ‌పై కేసీఆర్ స‌ర్కారు ఉదాసీనంగానే వ్య‌వ‌హించింద‌ని.. ప్ర‌జాసంఘాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. సాగ‌ర్ ఉప ఎన్నిక స‌మ‌యంలో హాలియాలో ల‌క్ష‌మందితో స‌భ నిర్వ‌హిస్తామ‌ని.. ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు కూడా క‌రోనా స‌మ‌యంలో బాధ్య‌తా యుత ముఖ్య‌మంత్రి ఇలా ఇంత మందితో స‌భ ఎందుకు పెడుతున్నార‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయిదే.. దీనిని కూడా త‌ప్పుబ‌ట్టిన సీఎం.. హాలియా స‌భ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌తోపాటు ఇక్క‌డి అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

ఇక‌, ఈ హాలియా స‌భ‌కు వ‌చ్చిన సాధార‌ణ ప్ర‌జ‌ల్లో ఎంత మంది క‌రోనా బారిన ప‌డ్డార‌నే విష‌యం తెలియా ల్సి ఉంది. ఇదిలావుంటే, క‌రోనా విజృంబిస్తున్నా.. కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు మొట్టికాయ‌లు బాగానే వేసింది. మీరు చేస్తారా? మ‌మ్మ‌ల్ని చేయ‌మంటారా? అంటూ.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. దీనికి గాను కేవ‌లం 48 గంట‌ల స‌మ‌యం ఇచ్చింది. ఈ క్ర‌మంలో విధిలేని ప‌రిస్థితిలో కేసీఆర్ ప్ర‌బుత్వం రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించింద‌ని .. నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

సీఎంకే క‌రోనా వ‌చ్చినా.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని.. హైకోర్టు నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావించిన కేసీఆర్‌.. ఈ క్ర‌మంలోనూ క‌ర్ఫ్యూ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నా రు. అదేదో ఆయ‌న విజ్ఞ‌త‌తో ముందుగానే నిర్ణ‌యం తీసుకుని ఉంటే.. క్రెడిట్ ద‌క్కేద‌ని.. చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్‌కు వ్ర‌తమూ చెడింద‌ని, ఫ‌లితం కూడా ద‌క్కలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.