Begin typing your search above and press return to search.

స్టూడెంట్స్ సామూహిక సూసైడ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   14 Feb 2018 5:30 AM GMT
స్టూడెంట్స్ సామూహిక సూసైడ్ వార్నింగ్
X
త‌ప్పు చేసినోళ్ల‌ను ఏం చేయాలి? క‌ఠినంగా శిక్షించాల‌ని ఎవ‌రైనా చెబుతారు. కానీ.. ఇప్పుడు అదే పెద్ద త‌ప్పుగా మారింది. చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌టం పెద్ద త‌ప్పుగా చిత్రీక‌రించ‌ట‌మే కాదు.. సామూహిక సూసైడ్లు చేసుకుంటామ‌ని వార్నింగ్ ఇవ్వ‌టం షాకింగ్ గా మారింది.

ర్యాగింగ్ జాడ్యానికి చెక్ చెప్పేందుకు వీలుగా క‌ఠిన‌మైన చ‌ట్టాల్ని తీసుకురావ‌టం తెలిసిందే. అయితే.. ర్యాంగింగ్ చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకున్నందుకు నిర‌స‌న‌గా తాడేప‌ల్లిగూడెం ఏపీ నిట్ కాలేజీ విద్యార్థులు ఇప్పుడు భారీ వార్నింగ్ ఇచ్చేశారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న కాలేజీ సిబ్బంది వాటిని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేనిప‌క్షంలో తామంతా సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని వార్నింగ్ ఇవ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది. ర్యాగ్ చేసిన 15 మంది విద్యార్తుల‌పై క‌ళాశాల తీసుకున్న చ‌ర్య‌ల్ని వెన‌క్కి తీసుకోని ప‌క్షంలో తామంతా సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని బెదిరిస్తున్నారు. అస‌లేం జ‌రిగిందో చూస్తే..

తాడేప‌ల్లిగూడెం ఏపీ నిట్ కాలేజీకి చెందిన కొంద‌రు విద్యార్థులు ఈ నెల 2న ర్యాగింగ్ చేశారు. దీంతో.. సీనియ‌ర్.. జూనియ‌ర్ విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. దీంతో.. కాలేజీ యాజ‌మాన్యం.. పోలీసులు రంగంలోకి దిగి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. ర్యాంగింగ్‌కు పాల్ప‌డిన 15 మందిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో గుణ‌సాయి ప్ర‌కాశ్ అనే సీనియ‌ర్ స్టూడెంట్ ను కాలేజీ నుంచి పూర్తిగా బ‌హిష్క‌రించ‌గా.. మ‌రో ఐదుగురు విద్యార్థుల్ని రెండేళ్లు స‌స్పెండ్ చేశారు. మ‌రో 9 మంది స్టూడెంట్స్ ను హాస్ట‌ల్స్ నుంచి స‌స్పెండ్ చేశారు. దీంతో.. విద్యార్థులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ర్యాగింగ్ చేయ‌టం త‌ప్పే అయినా.. విద్యార్థుల జీవితాలు నాశ‌న‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ర్యాగింగ్ అనే చిన్న త‌ప్పిదానికి ఇంత భారీ శిక్ష వేస్తే.. విద్యార్థుల జీవితాలు నాశ‌న‌మ‌వుతాయ‌ని.. అందుకే కాలేజీ యాజ‌మాన్యం తీసుకున్న చ‌ర్య‌ల్ని వెన‌క్కి తీసుకోవాలంటూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. లేని ప‌క్షంలో సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చేశారు. తాడేప‌ల్లి నిట్ కాలేజీ విద్యార్థులు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ర్యాగింగ్ లాంటి సీరియ‌స్ అంశాలకు సంబంధించి చ‌ర్య‌లు సింఫుల్ గా ఉండాల‌న‌టం.. తాము చెప్పిన‌ట్లు చేయ‌కుంటే సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని హెచ్చ‌రించ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.