Begin typing your search above and press return to search.

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ గా అవతరించిన నిఖత్.. !

By:  Tupaki Desk   |   26 Dec 2022 2:37 PM GMT
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ గా అవతరించిన నిఖత్.. !
X
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ తాజాగా జరుగుతున్న జాతీయ బాక్సింగ్ టోర్నీలో విజేతగా నిలిచింది. బోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 50 కేజీల విభాగంలో పాల్గొన్న నిఖత్ తొలి నుంచి టోర్నీలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తుంది. గత గురువారం 50 కేజీల ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లో నిఖత్‌ 5-0తో ఈవా మార్బానియాంగ్‌ (మేఘాలయ)పై గెలిచింది.

తొలి రౌండ్‌లో సునాయాసంగా నెగ్గిన నిఖత్‌ ప్రిక్వార్టర్స్‌లో అదే జోరు కనబర్చింది. ప్రత్యర్థులను వరుసబెట్టి నాకౌట్ చేస్తూ టోర్నీలో సెమి ఫైనల్ చేరుకుంది. ఈక్రమంలోనే తెలంగాణ స్టార్‌  ఏకపక్ష విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫైనల్ కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఫైనల్లో అనామిక (రైల్వేస్) ను 4-1 తేడాతో ఓడించి నిఖత్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ గా అవతరించిన నిఖత్ పై తోటి క్రీడాకారులు.. అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఈ స్థాయికి రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడేళ్ల కాలంలో ఆమెను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ మొక్కవొని ధైర్యంతో రింగులోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకెళ్లింది.

మూడేళ్ల కిందట మేరీ కోమ్ బాక్సింగ్ రంగంలో దూసుకెళుతోంది. ఆ క్రమంలోనే నిఖత్ యువ కెరటంలా బాక్సింగ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఆమెకు ప్రపంచ వేదికలపై అవకాశాలు రావడానికి కొంత సమయం పట్టింది. మేరీ కోమ్ కు సెలక్టర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమె తన హక్కుల కోసం పోరాడాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే నిఖత్ జరీన్ పోరాటంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. 2019లో మేరికోమ్ తో జరిగిన ట్రయల్ మ్యాచ్ నిఖత్ ఓడిపోయింది. ఆ తర్వాత క్రమంలో మేరికోమ్ యువత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బాక్సింగ్ నుంచి తప్పుకోవడంతో నిఖత్ కు మరిన్ని అవకాశాలు దక్కాయి. దీంతో 2022 ఏడాదిలో వరుసగా ఏకపక్ష విజయాలు సాధిస్తూ నిఖత్ జరీన్ సత్తా చాటింది.

ఈ సంవత్సరం ఆమె ఆడిన ప్రతి ప్రధాన ఈవెంట్ లోనూ విజేతగా నిలిచింది. ఏకపక్ష విజయాలతో మూడు ప్రధాన టైటిళ్లను గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఈఎస్పీఎన్ భారతదేశపు మహిళా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు ఎంపికైంది. తాజాగా జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ ను నిఖత్ గెలుచుకోవడంతో ఆమె పేరు మరోసారి మార్మోగిపోతోంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నిఖత్ జరీన్ పడిలేచిన కెరటంలా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.