Begin typing your search above and press return to search.

యంగ్ హీరో మాట‌!..ఏపీకి 'హోదా' కావాల్సిందే!

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:27 AM GMT
యంగ్ హీరో మాట‌!..ఏపీకి హోదా కావాల్సిందే!
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక లోటుతో పాటు నిధుల లేమితో నానా పాట్లు ప‌డుతున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న చ‌ట్టంలో హామీ ఇచ్చిన‌ట్లుగా ప్ర‌త్యేక్ హోదా ఇచ్చి తీరాల్సిందే. ఈ మాట విష‌యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మిన‌హా అన్ని పార్టీలు - ప్ర‌జా సంఘాలు - ప్ర‌ముఖ వ్యక్తులు - ప్ర‌జ‌లంద‌రిదీ ఇదే మాట‌. అయితే ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చినా స‌రిపోతుందంటూ టీడీపీ త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం మాట మార్చేసింద‌ని ఏపీ ప్ర‌జ‌లు ఆ పార్టీపై ఇప్ప‌టికే గుర్రుగా ఉన్నారు. అయినా ఏమాత్రం ప‌ట్టించుకోని టీడీపీ త‌న‌దైన శైలిలోనే ముందుకు సాగుతోంది. దీని ఫ‌లితం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రతిఫ‌లిస్తుంద‌న్న అంచ‌నాలు లేక‌పోలేదు. టీడీపీ వైఖ‌రి ఎలా ఉన్నా... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం ఎత్తున్న స్వ‌రాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎంత అవ‌స‌ర‌మ‌న్న విష‌యంపై సుదీర్ఘ పోరాట‌మే చేశార‌ని చెప్పాలి. ప్ర‌త్యేక హోదా వ‌స్తే.. రాష్ట్రానికి ఏ మేర ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్న విష‌యాన్ని యువ‌త‌కు వివ‌రించేందుకు ఆయ‌న ఏకంగా యువ భేరీల‌ను నిర్వ‌హించారు. ఇక ఆ పార్టీ శ్రేణులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై గ‌ళం విప్పుతూనే ఉన్నాయి.

మ‌రోవైపు టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఓ మోస్త‌రు పోరాట‌మే చేశార‌ని చెప్పాలి. తిరుప‌తి నుంచి మొద‌లుపెట్టిన ప‌వ‌న్‌... కాకినాడ‌, అనంత‌పురం వేదిక‌గా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలి వాద‌న వినిపించారు. ఇక సినీ న‌టుడిగా ఉంటూనే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రంగంలోకి దిగేసిన హీరో శివాజీ... ప్ర‌త్యేక హోదా కోసం సుదీర్ఘ పోరాట‌మే చేశారు. హోదా కోసం ఆయ‌న విజ‌య‌వాడ కేంద్రంగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కూడా చేశారు. అయితే ప్ర‌భుత్వం ఆయ‌న పోరాటంపై ఉక్కుపాదం మోపింది. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్నా... ఇప్పుడు ఆయ‌న గ‌ళం అంత‌గా వినిపించ‌డం లేద‌నే చెప్పాలి. తాజాగా శివాజీ మాదిరే హోదాపై గ‌ళం విప్పేందుకు మ‌రో యంగ్ హీరో రంగంలోకి దిగేశాడు. అత‌డే ఇప్పుడు టాలీవుడ్‌ లో మంచి జోరు మీదున్న నిఖిల్‌. నిన్న విజ‌య‌వాడలో కేన్స‌ర్ పై అవ‌గాహ‌న కోసం నిర్వ‌హించిన 5కే ర‌న్‌ లో పాలుపంచుకునేందుకు వ‌చ్చిన నిఖిల్ ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలిలో స్వ‌రం పెంచారు.

అయితే నిన్న‌టి కార్య‌క్ర‌మంలో త‌న‌ను మాట్లాడ‌నీయ‌కుండా కొంద‌రు అడ్డుకున్నార‌ని - అయినా ఏపీకి ప్ర‌త్యేక హోదాపై తానెందుకు మాట్లాడ‌కూడ‌ద‌ని అత‌డు ఇప్పుడు స‌రికొత్త రీతిలో సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అయినా నిఖిల్ ఏమ‌న్నాడ‌న్న విష‌యానికి వ‌స్తే.. *ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా - ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. కొంత మంది ఇలాంటి విషయాలు నీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తెలుగు వ్యక్తిగా - ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని' నటుడు నిఖిల్ తన ట్వీట్ట‌ర్‌ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందంటూ ఓ ఫొటోనూ పోస్ట్ చేశారు. వెర‌సి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మ‌రో యువ న‌టుడు రంగంలోకి దిగిపోయాడ‌న్న మాట‌.