Begin typing your search above and press return to search.

నీలోఫర్ ఆస్పత్రి సిబ్బంది మొత్తం క్వారంటైన్ కు..!

By:  Tupaki Desk   |   19 April 2020 7:43 AM GMT
నీలోఫర్ ఆస్పత్రి సిబ్బంది మొత్తం క్వారంటైన్ కు..!
X
హైదరాబాద్ లోని ప్రముఖ పిల్లల ఆసుపత్రి ‘నీలోఫర్’లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మొత్తం క్వారంటైన్ కు వెళ్లాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. దీనికంతటికి కారణం ఓ రెండు నెలల చిన్నారి కావడం గమనార్హం.

తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణ పేట్ జిల్లాలోని అభంగాపూర్ కు చెందిన రెండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం 200 మందిని సిబ్బందిని క్వారంటైన్ లో ఉండాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు. వీరిలో ప్రొఫెసర్లు - అసిస్టెంట్ ప్రొఫెసర్లు - నర్సులు సహా ఇతర సిబ్బంది ఉన్నారు.

ఇక శిశువుకు కరోనా రావడంతో ఆ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులను క్వారంటైన్ కు తరలించారు. ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనే విషయం అంతుబట్టడం లేదు. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా లేని నారాయణపేట జిల్లాలో ఈ ఘటనతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ‘అభంగాపూర్’ను కంటైన్ మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించి సంబంధమున్న అందరినీ ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.

శిశువుకు పురుడు పోసిన కారణంగా నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని ఐసోలేషన్ కు తరలించారు. ఇంతకుముందు శిశువుకు చికిత్స చేసిన వైద్యుడిని ఐసోలేషన్ చేశారు. శిశువుతో సంబంధమున్న మొత్తం 18మంది బంధువులకు కరోనా పరీక్షలు చేశారు.