Begin typing your search above and press return to search.

తెగేదాక లాగుతున్నారా ?

By:  Tupaki Desk   |   12 Jan 2021 3:30 PM GMT
తెగేదాక లాగుతున్నారా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వంతో నిమ్మగడ్డ సంబంధాలు దాదాపు క్షీణించినట్లే. మరో మూడు నెలల్లో రిటైర్ అయిపోతున్న నిమ్మగడ్డ ఏదో పద్దతిలో ప్రభుత్వాన్ని గబ్బుపట్టించాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. అందుకనే పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయగానే డివిజన్ బెంచి ముందు కేసులు దాఖలు చేశారు. నిజానికి సింగిల్ బెంచ్ అన్నా ఫుల్ బెంచ్ అన్నా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలను నిర్వహించమని చెప్పే అవకాశం దాదాపు లేదు. మరింత చిన్న విషయాన్ని నిమ్మగడ్డ ఎందుకు ఆలోచించటం లేదు ?

చీఫ్ సెక్రటరీ అండ్ కో నిమ్మగడ్డను కలిసినపుడు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. అయినా సరే తాను మాత్రం ఎన్నికలను జరిపితీరాల్సిందే అని పంతం పట్టి మరీ ప్రభుత్వానికి చెప్పకుండానే నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో నిర్వహించటం సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. అందుకనే పంచాయితీ నోటిఫికేషన్ను కొట్టేసింది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాన్ని నిమ్మగడ్డ గుర్తిస్తారని ప్రభుత్వం అనుకున్నది.

అయితే సింగిల్ బెంచ్ ఎన్నికలకు వ్యతిరేకంగా తీర్పివ్వగానే డివిజన్ బెంచ్ ముందు కేసు వేశారు. నిమ్మగడ్డ వాదన ఏమిటంటే నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కోర్టులు కూడా జోక్యం చేసుకోలేందట. కానీ ఇక్కడ నిమ్మగడ్డ మరచిపోయిందేమంటే ప్రజల ప్రాణాలకు, నోటిఫికేషన్ కు సంబంధముంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టుకోవచ్చన్న ప్రభుత్వ సూచనను కూడా నిమ్మగడ్డ అంగీకరించటం లేదు. ఈ పరిస్దితుల్లోనే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా అభిప్రాయపడింది.

నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదంటున్న నిమ్మగడ్డ మరి మొన్నటి మార్చిలో ఎన్నికల ప్రక్రియను తాను మాత్రం ఎలా వాయిదా వేయగలిగారు ? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ వాయిదాకు కరోనా వైరస్ నే కదా నిమ్మగడ్డ కారణంగా చూపింది. అంటే తాను అనుకుంటే ఎన్నికలను జరిపేయాలి. తాను తలచుకుంటే ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపేయగలరు. తాను తలచుకుంటే మళ్ళీ ఎన్నికలను నిర్వహించగలరు. నిమ్మగడ్డ తీరుచూస్తుంతే తన నిర్ణయాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకునేందుకు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ నిమ్మగడ్డ మరచిపోయిన విషయం ఒకటుంది. ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణలో కమీషన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేందు. ఇదే సమయంలో ఏ కోర్టు కూడా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎన్నికల విధులు నిర్వహించమని చెప్పలేందు. ఈ విషయాన్నే ప్రభుత్వమైనా, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ అయినా గట్టిగా చెబుతున్నాయి. చూద్దాం డివిజన్ బెంచ్ ముందుకు కేసును తీసుకెళ్ళారు కాదా నిమ్మగడ్డ ఏమి చెబుతుందో ?