Begin typing your search above and press return to search.

ఎంత విచిత్రంః నిమ్మ‌గ‌డ్డ ఎన్నిక‌లు వ‌ద్ద‌నుకుంటున్నారా..?

By:  Tupaki Desk   |   18 March 2021 11:10 AM GMT
ఎంత విచిత్రంః నిమ్మ‌గ‌డ్డ ఎన్నిక‌లు వ‌ద్ద‌నుకుంటున్నారా..?
X
ఇంత‌లోనే ఎంత తేడా..? స‌రిగ్గా నెల‌రోజు క్రితం వ‌ర‌కు ఏపీలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సాగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ప్ర‌భుత్వం ఇప్పుడు స‌మ‌యం కాదంటే.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇదే మంచి స‌మ‌యం.. త‌రుణం మించ‌కూడ‌ద‌ని చెప్పారు. వాదాలు.. వివాదాలు.. వ్యాజ్యాలు.. కౌంట‌ర్లు.. ఎన్ని సాగాయి..?

ఎన్నిక‌లు ఇప్పుడు నిర్వ‌హించొద్ద‌ని వైసీపీ నేత‌లు కోర్టు మెట్లు ఎక్కితే.. ఇప్పుడే నిర్వ‌హించాలంటూ ప‌ట్టుబ‌ట్టారు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌. కానీ.. నెల తిరిగే స‌రికి మొత్తం తారు మారైపోయింది! ఇప్పుడు.. నిమ్మ‌గ‌డ్డే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని వైసీపీ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు.

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి ఇంకా ప‌రిష‌త్ ఎన్నిక‌లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలాఖ‌రుతో నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీకాలం పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లోగానే.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు కూడా ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంతోపాటు వైసీపీ నేత‌లు కూడా కోరుతుండ‌డం విశేషం.

ఆరు రోజుల్లో ఎన్నిక‌లు పూర్తిచేసే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌గా.. నిమ్మ‌గ‌డ్డ ఆధ్వ‌ర్యంలోనే ఈ ఎన్నిక‌లు కొన‌సాగాల‌ని మంత్రి పెద్దిరెడ్డి వంటి నేత‌లు మాట్లాడారు. అంతేకాదు.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు వెంట‌నే నిర్వ‌హించాల‌ని కోరుతూ హైకోర్టులో మూడు పిటీష‌న్లు కూడా దాఖ‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

దీంట్లో ద‌ర‌ఖాస్తు దారులు చెప్పిన విష‌యం ఏమంటే.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా నిమ్మ‌గ‌డ్డ సెల‌వుపై పోతున్నార‌ని పేర్కొన‌డం విశేషం. దీనిపై విచారించిన న్యాయ‌స్థానం.. స్పందించాలంటూ నిమ్మ‌గ‌డ్డ‌ను ఆదేశించింది‌. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ శ‌నివారానికి విచార‌ణ వాయిదా వేసింది.

నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఎన్నిక‌లు వ‌ద్ద‌న్న‌వారు.. ఇప్పుడు ఆయ‌నే నిర్వహించాల‌ని ప‌ట్టుబ‌డుతుండ‌గా.. నిమ్మ‌గ‌డ్డ మాత్రం అందుకు విముఖంగా ఉన్నార‌ని ప్ర‌చారం అవుతుండ‌డం విచిత్రం. పంచాయ‌తీ, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ అఖండ విజ‌యం సాధించ‌డం వ‌ల్లే ప‌రిస్థితి తారుమారైంద‌ని అంటున్నారు.