Begin typing your search above and press return to search.

మళ్ళీ కోర్టు మెట్లక్కనున్న నిమ్మగడ్డ

By:  Tupaki Desk   |   24 Jan 2021 7:30 AM GMT
మళ్ళీ కోర్టు మెట్లక్కనున్న నిమ్మగడ్డ
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ కోర్టు మెట్లక్కనున్నారు. పంచాయితి ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జరిగిన పరిణామాలపై నిమ్మగడ్డ చాలా అసంతృప్తితో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పంచాయితిరాజ్ ముఖ్య కార్యదర్శి, కమీషనర్+జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు జరగాల్సుంది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్సుకు చాలామంది ఉన్నతాధికారులు హాజరుకాలేదు.

ముందుగానే వీడియో కాన్ఫరెన్సు ఉంటుందని కమీషన్ వర్గాలు చెప్పినా ఉన్నతాధికారుల్లో చాలామంది పట్టించుకోలేదు. కాకపోతే కొందరు మాత్రం టెక్నికల్ ఎర్రర్ అని చెబుతున్నారు. ఏదేమైనా వీడియో కాన్ఫరెన్సుకు హాజరుకావటం ఇష్టంలేదని అర్ధమైపోతోంది. నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులో హాజరుకారు. నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఆధారంగా చీఫ్ సెక్రటరీ వివిధ శాఖల ఉన్నతాధికారులకు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సర్య్కులర్ జారీచేయాలి. అప్పుడే అందరు కమీషన్ పరిధిలోకి వెళతారు. ఆ సర్క్యులర్ నే చీఫ్ సెక్రటరీ జారీచేయలేదు.

ఇక మీడియా సమావేశం సందర్భంగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్ధమీద నమ్మకం, పూర్తి గౌరవం, విశ్వాసం, విధేయత ఉందని చెప్పిందంతా అబద్ధమే అంటున్నారు. ఎందుకంటే 2018 ఆగష్టులోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది మూడు నెలల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు పెట్టమని. మరి ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదని నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్దమైన బాధ్యతలను, విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పటం కూడా అబద్ధమే అంటున్నారు. ఎందుకంటే 2018 జూలైలో నిర్వహించాల్సిన ఎన్నికలను అప్పట్లో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలంటు డిమాండ్ చేస్తున్నారు.

సరే ఇక ప్రస్తుతానికి వస్తే ఇటు ఉన్నతాధికారులు కానీ అటు ఉద్యోగులు కానీ ఎవరు నిమ్మగడ్డకు సహకరించే పరిస్ధితి కనపించటం లేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొంటామన్న చీఫ్ సెక్రటరీ, ఉద్యోగసంఘాల విజ్ఞప్తిలో నిమ్మగడ్డకు సహేతుకత కనిపంచకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఏకకాలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం సాధ్యంకాదని ప్రభుత్వం చెబుతున్నది నిమ్మగడ్డకు తప్పుగా కనిపిస్తోంది.

ఈ విషయాలు చెప్పటానికి గవర్నర్ అపాయిట్మెంట్ కోరితే దొరకలేదు. దాంతో మళ్ళీ సోమవారం కోర్టులో ఇదే విషయమై పిటీషన్ వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇఫ్పటివరకు ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయటం నిమ్మగడ్డకు అలవాటైపోయిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎలాగూ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది కాబట్టి అక్కడే తేల్చుకుంటామని అంటున్నారు. మరి సోమవారం సుప్రింకోర్టు ఏమి చెబుతుందనే విషయం ఆసక్తిగా మారింది.