Begin typing your search above and press return to search.

పంచాయితీ: నిమ్మగడ్గ టార్గెట్ మారింది..

By:  Tupaki Desk   |   1 Feb 2021 4:25 PM GMT
పంచాయితీ: నిమ్మగడ్గ టార్గెట్ మారింది..
X
ఏపీ పంచాయితీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి తన ప్రతాపం చూపించారు. కొద్దిరోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. ఒకరికొకరు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ హీటెక్కిస్తున్నారు.

తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. పంచాయితీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సంబంధించిన కీలక అంశాలు, రూల్స్ ను పాటించాలని నిమ్మగడ్డ తాజాగా లేఖ రాశారు.

కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటించరాదని.. ప్రచారం చేయవద్దని సీఎస్ కు రాసిన లేఖలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వారు ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించకూడదని లేఖలో ఆదేశించారు. ప్రైవేటు వాహనాలు వినియోగించినా తమ హోదాను నంబర్ ప్లేట్లపై ఉండకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఇక ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు ఏవీ ఎన్నికల సమయంలో వినియోగించకూడదు అని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. చైర్మన్లు తమతో ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు.ఇలా పంచాయితీ ఎన్నికల వేళ తనకున్న అస్త్రాలను అన్నింటిని వాడేస్తూ నిమ్మగడ్డ కాకరేపుతున్నారు. సంచలన నిర్ణయాలతో అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.