Begin typing your search above and press return to search.

వ్య‌వ‌సాయం చేసుకుంటున్న టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   8 Jun 2016 3:33 PM GMT
వ్య‌వ‌సాయం చేసుకుంటున్న టీడీపీ ఎంపీ
X
ఏపీలో అధికార టీడీపీలో ఆయ‌నో సీనియ‌ర్ లీడ‌ర్‌. మాజీ మంత్రి కూడా... పార్టీ క‌ష్ట‌కాలంలో ఉండి, ప్రతిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న ఎంపీగా విజ‌యం సాధించారు. ఒక‌ప్పుడు రాజ‌కీయంగాను - పార్టీలోను ఎంతో ప‌లుకుబ‌డి ఉన్న ఆయ‌న్ను ఇటీవ‌ల పార్టీ అధిష్టానంతో పాటు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ట‌. దీంతో రాజ‌కీయంగా నైరాశ్యంలో ఉన్న ఆయ‌న గ‌త ఆరు నెల‌లుగా అస‌లు బ‌య‌టికే రావ‌డం లేదు. ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఆయ‌న సొంత వ్య‌వ‌సాయ‌క్షేత్రంలో పొలం ప‌నులు చూసుకుంటున్నారు. ఇంత‌కు ఆ ఎంపీ ఎవ‌రు ? ఏమా క‌థ ? చూద్దాం.

అనంత‌పురం జిల్లా హిందూపురం లోక్‌ స‌భ స‌భ్యుడు నిమ్మల కిష్టప్ప ఆరు మాసాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. టీడీపీలో సీనియ‌ర్ లీడ‌ర్ అయిన ఆయ‌న గ‌తంలో అనంత‌పురం జిల్లా గోరంట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేశారు. బ‌ల‌మైన బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో అప్ప‌ట్లో జిల్లాలో ఆయ‌న హ‌వా కొన‌సాగింది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో గోరంట్ల ర‌ద్ద‌వ్వ‌డంతో రాష్ర్ట - జిల్లా రాజ‌కీయాల్లో కిష్ట‌ప్ప హ‌వాకు బ్రేక్ ప‌డింది.

2009లో ప‌రిటాల సునీత రాప్తాడుకు షిఫ్ట్ అవ్వ‌డంతో కిష్ట‌ప్ప పెనుగొండ‌పై క‌న్నేశారు. అయితే చంద్ర‌బాబు నిమ్మలకు హిందూపురం పార్లమెంట్‌ స్థానాన్ని కేటాయించి.. పెనుకొండ నియోజకవర్గం టికెట్‌ బీకే పార్థసారథికి ఇచ్చారు. వీరిద్ద‌రు వ‌రుస‌గా 2009 - 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే ప్ర‌స్తుతం పార్టీ అధికారంలో ఉన్నా కిష్ట‌ప్ప‌ను ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ట‌. ఆయ‌న లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయ‌న్ను అస్స‌లు ప‌ట్టించుకోవడం లేద‌న్న‌ది అనంతపురం జిల్లాలో వినిపిస్తున్న టాక్‌.

ఇక ఎమ్మెల్యేల‌ను కాద‌ని ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్ల‌లో కాలు పెట్టే ప‌రిస్థితి లేదు. ఇటీవ‌ల‌ పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడుకు కూడా కిష్టప్ప హాజరుకాలేదు. జిల్లా స్థాయి మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాల్లో కూడా ఆయ‌న క‌న‌ప‌డ‌లేదు. ఇటీవ‌ల చంద్ర‌బాబు జిల్లాకు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న క‌న‌ప‌డ‌లేదు. ఎంపీగా త‌న‌కు అస్స‌లు గౌర‌వం ఉండ‌డం లేద‌ని ఆయ‌న లోలోన తెగ మ‌ద‌న‌ప‌డిపోతున్న‌ట్టు స‌మాచారం. అందుకే ఆయ‌న అస్స‌లు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని టాక్‌. పార్ల‌మెంటు స‌మావేశాలు ఉన్న‌ప్పుడు ఢిల్లీ వెళ్ల‌డం...జిల్లాలో ఉంటే త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌నులు చూసుకోవ‌డం చేస్తున్నార‌ట‌.