Begin typing your search above and press return to search.

నీర‌వ్ మోడీ అరెస్ట్‌.. మోడీ సుడి తిరిగిపోయిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   20 March 2019 11:09 AM GMT
నీర‌వ్ మోడీ అరెస్ట్‌.. మోడీ సుడి తిరిగిపోయిన‌ట్లేనా?
X
కాలం క‌లిసి వ‌స్తే ఇలానే ఉంటుంది మ‌రి. దేశానికి కాపలాదారు (చౌకీదార్‌)గా చెప్పుకునే మోడీ హ‌యాంలో ఆర్ధిక నేర‌స్తులు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు చొప్పున దేశం నుంచి ద‌ర్జాగా విదేశాల‌కు వెళ్లిపోతున్నారంటూ విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న వేళ‌.. మోడీకి ఊర‌ట క‌లిగించే ప‌రిణామం చోటు చేసుకుంది.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు వేలాది కోట్ల రూపాయిల బ‌కాయిలు ప‌డి.. ఆ విష‌యం బ‌య‌ట ప‌డే నాటి నుంచి దేశం నుంచి వెళ్లిపోయి.. త‌ప్పించుకు తిరుగుతున్న నీర‌వ్ మోడీని లండ‌న్ లో అరెస్ట్ చేశారు. ఈ ప‌రిణామంతో ఆయ‌న్ను భార‌త్ కు అప్ప‌గించే ప్ర‌క్రియ మొద‌లైన‌ట్లేన‌ని చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌తో మోడీ స‌ర్కారు దౌత్య విజ‌యం సాధించిన‌ట్లేన‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం నీర‌వ్ మోడీని మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో లండ‌న్ లోని కోర్టులో హాజ‌రుప‌రుస్తార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అక్క‌డి కోర్టు అనుమ‌తి ఇస్తే..ఆయ‌న్ను భార‌త్ కు తీసుకొచ్చే ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం కావటం ఖాయం.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు దాదాపు రూ.14వేల కోట్ల మేర ఎగ్గొట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న విదేశాల‌కు పారిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న ఆచూకీ కోసం మోడీ స‌ర్కారు తెగ ట్రై చేసిన‌ట్లు చెప్పారు. అయితే.. ఆయ‌న ఆచూకీ తెలియ‌టం లేద‌ని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆయ‌న ఆచూకీ ఇదిగో అంటూ లండ‌న్ కు చెందిన ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు ఆయ‌న్ను రోడ్డు మీద ప‌లుక‌రించ‌టం.. ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌టం.. ఆయ‌న దానికి న‌వ్వుతూ నో కామెంట్ అని చెప్ప‌టం తెలిసిందే.

ఈ వార్తా క‌థ‌నం ప్ర‌సార‌మైన నాటి నుంచి మోడీ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుత‌న్నాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం తెర మీద‌కు రావ‌టం.. ప్ర‌భుత్వాలు ప‌ట్టుకోలేని నీర‌వ్ మోడీ ఆచూకీని ఒక మీడియా సంస్థ వెలుగు తీయ‌టం పెద్ద చ‌ర్చ‌కు తెర తీసింది.

ఈ నేప‌థ్యంలో భార‌త్ స‌ర్కారు బ్రిట‌న్ ప్ర‌భుత్వం మీద ఒత్తిడి తీసుకురావ‌టం.. అందుకు అక్క‌డి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించి నీర‌వ్ మోడీని అరెస్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈడీ రాసిన లేఖ‌తోనూ లండ‌న్ లోని హోం శాఖ అధికారులు నీర‌వ్ మోడీని అరెస్ట్ చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ నీర‌వ్ మోడీ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ సూటిగా స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్న బీజేపీ నేత‌లకు తాజాగా చ‌క్క‌టి అస్త్రం ల‌భించింద‌ని చెప్పాలి. త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌తోనే నీర‌వ్ మోడీని ప‌ట్టుకోగ‌లిగిన‌ట్లుగా ప్ర‌చారం చేసుకోవ‌టం ఖాయం. ఒక‌వేళ‌.. లండ‌న్ కోర్టును ఒప్పించి ఆయ‌న్ను భార‌త్ కు తీసుకురాగ‌లిగితే మోడీ స‌ర్కారు సుడి తిరిగిపోయిన‌ట్లే. ఎన్నిక‌ల వేళ‌.. మోడీ స‌ర్కారుకు ఇంత‌కు మించి కావాల్సిందేముంది?