Begin typing your search above and press return to search.

లోను ద‌క్కేందుకు నీర‌వ్ గిఫ్ట్‌ వజ్రాలు - బంగారం

By:  Tupaki Desk   |   4 March 2018 9:17 AM GMT
లోను ద‌క్కేందుకు నీర‌వ్ గిఫ్ట్‌ వజ్రాలు - బంగారం
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో ఓ పీఎన్‌బీ అధికారికి నీరవ్ మోడీ.. బంగారు, వజ్ర ఆభరణాలను లంచంగా ఇచ్చినట్లు సీబీఐ చెప్పింది. 12 వేల కోట్లకుపైగా జరిగిన ఈ స్కాంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే. విదేశాల్లోని ఇండియన్ బ్యాంక్స్ నుంచి లోన్లు పొందేందుకు అవసరమైన అండర్‌ టేకింగ్ లేఖలను ఇవ్వడానికి పీఎన్‌ బీ అధికారులకు నీరవ్ లంచాలు ఇచ్చాడని తొలిసారి సీబీఐ చెప్పడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు.

త‌న విచార‌ణ సంద‌ర్భంగా ఒక అధికారికి నగల రూపంలో భారీ లంచం ముట్టినట్లు సీబీఐ స్పష్టంచేసింది. ఆ అధికారి పేరు యశ్వంత్ జోషి. ఇతను ముంబై పీఎన్‌ బీ బ్రాంచ్‌ లో ఫారెక్స్ డిపార్ట్‌ మెంట్ మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. అతనికి నీరవ్ మోడీ 60 గ్రాములున్న రెండు బంగారు కాయిన్స్ - బంగారం - వజ్రాలు పొదిగిన చెవిపోగులు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ ఆభరణాలను సీబీఐ అధికారులు జోషి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోడీ ఈ స్కాంకు పాల్పడినట్లు చెప్పడానికి ఇదే నిదర్శనమని సీబీఐ అంటోంది. నీరవ్‌ కు అండర్‌ టేకింగ్ లెటర్స్ ఇవ్వడానికి ఇలా జోషి లంచాలు తీసుకుంటూనే ఉన్నాడని చెప్పింది.

ఇదిలావుంటే, ఈ వ్యవహారంలో నీరవ్ మోడీ దర్యాప్తు సంస్థలపై ఎదురుదాడికి ఉపక్రమించాడు. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముందస్తుగా నిశ్చయించుకున్న ప్రకారమే తనపై చర్యలు చేపట్టాయని - న్యాయస్థానంతో నిమిత్తం లేకుండా తన భవితవ్యాన్ని ఇప్పటికే నిర్ణయించేశాయని ఆయన శనివారం ఆరోపించాడు. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అత్యంత వేగవంతంగా వ్యవహరించడాన్ని చూస్తుంటే ముందస్తుగా నిశ్చయించుకున్న ప్రకారంగానే అవి నాపై చర్యలు చేపట్టాయని, నా సమాధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే - కనీసం న్యాయస్థానాన్ని కూడా గౌరవించకుండానే అవి ఇప్పటికే నా భవితవ్యాన్ని నిర్ణయించాయని స్పష్టమవుతున్నది అని ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ కు పంపిన ఈ-మెయిల్‌లో నీరవ్ మోడీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం తాను విదేశీ వ్యాపార కార్యకలాపాలతో తీరికలేకుండా ఉన్నానని పేర్కొంటూ దర్యాప్తులో పాలు పంచుకునేందుకు నిరాకరించాడు. `పాస్‌ పోర్టుల జారీ సంస్థ నా పాస్‌ పోర్టును సస్పెండ్ చేసింది. మీరేమో దర్యాప్తులో పాలుపంచుకోవాలని నన్ను కోరుతున్నారు. పాస్‌ పోర్టును రద్దు చేయడానికి కారణాలేమిటో తెలియజేయాలని కోరుతూ నేను లేఖరాసిన వెంటనే పాస్‌ పోర్టుల జారీ సంస్థ ఏకంగా నా పాస్‌ పోర్టునే రద్దు చేసింది` అని నీరవ్ పేర్కొన్నాడు.