Begin typing your search above and press return to search.

నీర‌వ్ స్కాం:ఆ పెద్దాయ‌న ప‌ద‌వికి ఎస‌రు

By:  Tupaki Desk   |   25 Feb 2018 6:04 AM GMT
నీర‌వ్ స్కాం:ఆ పెద్దాయ‌న ప‌ద‌వికి ఎస‌రు
X
11 వేల 300 కోట్ల స్కామ్‌ లో ప్రధాన సూత్రదారి అయిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ఈ విష‌యంలో పెద్ద త‌ల‌కాయల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల ప‌రంగా ఇప్ప‌టికే ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షమైన‌ కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర పార్టీలు అధికార బీజేపీని ఇర‌కాటంలో ప‌డేస్తుండ‌గా...ఈ జాబితాలోకి తాజాగా బ్యాంకు ఉద్యోగులు చేరారు. ఏకంగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ ఉర్జిత్ ప‌టేల్‌ పై నిప్పులు చెరిగారు. ఆయ‌న వ్య‌వ‌హారం సందేహంగా ఉంద‌న్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్‌ మోడీ వ్యవహారంలో...ఉర్జిత్ ప‌టేల్‌ పై బ్యాంకు ఉద్యోగుల సంఘం నిప్పులు చెరిగింది. తక్షణమే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ కుంభకోణానికి ఉర్జిత్ పటేల్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇంత భారీ స్కామ్‌ జరిగినా ఉర్జిత్ పటేల్ మాట్లాడకపోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. నీరవ్‌ మోడీపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆర్‌బీఐకి చెందిన నామినీలు పీఎన్‌ బీలో ఉన్నారు కాబట్టే... ఉర్జిత్‌ పటేల్‌ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్బీఐ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని బ్యాంకు ఉద్యోగులు మండిపడ్డారు.

ఇదిలాఉండ‌గా....మరోవైపు పీఎన్‌ బీ కేసులో ప్రధాన నిందితులకు కేంద్రప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. 11 వేల 300 కోట్ల స్కామ్‌ లో ప్రధాన సూత్రధారులైన నీరవ్‌ మోడీ - మెహుల్ చోక్సీల పాస్‌ పోర్టులను రద్దు చేసింది. పాస్‌ పోర్టుల రద్దుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నీరవ్ మోడీకి ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఈనెల 16న పాస్‌ పోర్టులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం... వారిద్దరి నుంచి వివరణ కోరింది. నిందితుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి పాస్‌పోర్టులను శాశ్వతంగా రద్దు చేశారు.