Begin typing your search above and press return to search.

నీర‌వ్ య‌వ్వారం మోడీ బ్యాచ్‌ కు చుట్టుకోనుందా?

By:  Tupaki Desk   |   17 Feb 2018 9:49 AM GMT
నీర‌వ్ య‌వ్వారం మోడీ బ్యాచ్‌ కు చుట్టుకోనుందా?
X
ఇప్ప‌టివ‌ర‌కూ దేశం చాలానే కుంభ‌కోణాల్ని చూసింది. స్కాంల‌కు పాల్ప‌డినోళ్లు చ‌ట్ట‌ప‌రంగా కేసుల్లోకి చిక్కుకోవ‌టం.. వారిని అరెస్ట్ చేయ‌టం.. జైళ్ల‌కు త‌ర‌లించ‌టం లాంటివి చూశాం ఇప్పుడు అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకుల‌కు ఎగ్గొట్టి మ‌రీ.. ద‌ర్జాగా విదేశాల‌కు పారిపోయే తీరు షాకింగ్ గా మారుతోంది.

ఆ మ‌ధ్య‌న‌ లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా ఏదో పొర‌పాటున దేశం నుంచి క్షేమంగా జంప్ అయ్యార‌ని స‌ర్ది చెప్పుకున్నా.. తాజాగా నీర‌వ్ మోడీ య‌వ్వారం చూసిన త‌ర్వాత‌.. ఇదంతా ప‌క్కా ప్లాన్ తో.. పెద్ద ఎత్తున పావులు క‌దిపార‌న్న సందేహం రాక మాన‌దు.

నీర‌వ్ వ్య‌వ‌హారాన్ని చూస్తే.. అత‌గాడి తీరు మీద ఇప్పుడు కాదు..కొన్నేళ్ల క్రిత‌మే సందేహాలు వ్య‌క్త‌మైన‌ట్లుగా వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. బ్యాంకుల్ని నీర‌వ్ మోసం చేస్తున్న స‌మాచారం కూడా అందిందని.. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ది మాత్రం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైన ప‌క్షంలో.. ఈ వ్య‌వ‌హారం మోడీ అండ్ కోకు పెద్ద దెబ్బ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. నీర‌వ్ తీరుపై డౌట్ ఉన్న‌ప్పుడు.. అత‌న్ని ప్ర‌ధాని మోడీతో పాటు దావోస్ ట్రిప్ న‌కు ఎలా అనుమ‌తి ఇస్తార‌న్న ప్ర‌శ్న ప్రాధ‌మికంగా ఎదుర‌వుతోంది. దేశ ప్ర‌ధానితో పాటు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో క‌లిసి ఫోటో తీసుకునే వ‌ర‌కూ అధికారులు ఏం చేస్తున్నార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఒక‌వేళ‌.. నీర‌వ్ తీరు సందేహాస్ప‌దంగా ఉంటే.. నిఘా వ‌ర్గాలు పీఎంవోను అలెర్ట్ చేయాల్సి ఉంది. మ‌రి.. అలా జ‌రిగిందా? అంటే లేద‌నే చెబుతున్నారు.

అలా ఎందుకు జ‌ర‌గ‌లేద‌న్న ప్ర‌శ్న ఇప్పుడు మోడీ అండ్ కో వైపు వేలెత్తి చూపేలా చేస్తోంది. అత‌డి తీరు అనుమానాస్ప‌దంగా ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని లాంటి అత్యున్న‌త స్థానంలో ఉన్న నేత‌కు కిలోమీట‌ర్ల దూరంగా పెట్టేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవ‌టం చూస్తే.. మోడీ అండ్ కో మీద స‌రికొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.