Begin typing your search above and press return to search.

నిర్భయ దోషి పిటిషన్..సుప్రీం కు అత్యవసరమయ్యిందే!

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:14 PM GMT
నిర్భయ దోషి పిటిషన్..సుప్రీం కు అత్యవసరమయ్యిందే!
X
దేశవ్యాప్తంగా పెను కలకలం రేపిన నిర్భయ ఘటనలో దోషి అంటే... అందరికీ ఆగ్రహావేశమే. ఎందుకంటే... నిర్భయపై వారు సాగించిన కీచక పర్వం అలాంటిది మరి. రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన నిర్భయ దోషులను తక్షణమే ఉరి తీయాలంటే ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తుంటే... మన చట్టాల్లోని కొన్ని లొసుగులను అవకాశంగా మలచుకుంటున్న దోషులు... ఎప్పటికప్పుడు తమ ఉరిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఉరి వాయిదా దాదాపుగా కుదరదన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ... నిర్భయ దోషుల్లోని ఓ కరడుగట్టిన నేరస్థుడు.. మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. సాధారణంగా అయితే అతడి పిటిషన్ ను కోర్టు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే చెప్పాలి. అయితే మన చట్టాల్లోని కొన్ని నిబంధనల కారణంగా సదరు పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.

నిజమా? అంటే... నిజమే మరి. సరే అయితే నిర్భయ దోషి పిటిషన్ సుప్రంకోర్టుకు అత్యవసర పిటిషన్ ఎలా అయ్యిందన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అతడి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే... విచారణ జాబితాలో ముఖేష్‌ పిటిషన్‌కు ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న వ్యక్తి అభ్యర్థన టాప్‌ ప్రియారిటీ కలిగి ఉంటుంది. ఈ విషయంలో మీరు రిజిస్ట్రీని ఆశ్రయించండి’’ అని జస్టిస్ బాబ్డే పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించారు. కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో నలుగురు దోషులు వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లకు సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వారిని ఉరితీయాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇక ఇప్పటికే ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న దోషులు.. వారికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేసి భంగపడ్డారు. చివరి ప్రయత్నంగా ముఖేష్‌ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరగా.. ఆయన దానిని తిరస్కరించారు. అయితే ఉరిశిక్ష తేదీ దగ్గరపడుతున్న వేళ్ల ముఖేష్‌ మరోసారి న్యాయస్థానం తలుపు తట్టాడు. ఆర్టికల్‌32 కింద క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా శనివారం సుప్రీంకోర్టును కోరాడు. దీంతో అతడి అభ్యర్థన పరిశీలనను వేగవంతం చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేమరి... కరడుగట్టిన నేరస్తుడైనా... ఉరి శిక్షకు సమయం ఆసన్నమైన వేళ... అతడి పిటిషన్ విచారణ ఏ కోర్టుకైనా అత్యవసరమే కదా.