Begin typing your search above and press return to search.

నిర్భయ దోషి తాజా రిక్వెస్ట్ వింటే ఒళ్లు మండాల్సిందే

By:  Tupaki Desk   |   7 March 2020 4:41 AM GMT
నిర్భయ దోషి తాజా రిక్వెస్ట్ వింటే ఒళ్లు మండాల్సిందే
X
ఎంతటి దారుణమైన నేరమైనా చేస్తాం... మాకు చట్టప్రకారం కల్పించాల్సిన అన్ని హక్కులు కల్పించాల్సిందే అంటూ పిడివాదన ను వినిపించే దారుణాన్ని గడిచిన కొద్ది నెలులుగా దేశ ప్రజలు చూస్తున్నారు. మాటల్లో చెప్పలేనంత దారుణ నేరానికి పాల్పడి... కించిత్ పశ్చాతాపం... పాపభీతి లేని నిర్భయ దోషుల్ని చూస్తున్న వారికి వారి మీద కోపం అంతకంతకూ పెరుగుతోంది. కోర్టులు తమకు విధించిన మరణశిక్ష అమలు కాకుండా ఉండేందుకు.. చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. వాటన్నింటిని వినియోగించుకునే తీరు చూస్తే... బాధితుల కంటే బాధ్యులకు ఇన్ని ఛాన్సులు ఉన్నాయా? అన్న భావన కలగటం ఖాయం.

నలుగురు నిర్భయ దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయాలన్న పాయింట్ తో పాటు... ఉరిని ఎదుర్కొనే వారికి ఉండే అవకాశాల్ని పూర్తిస్థాయిలో వాడేసుకోవటమే కాదు... అతి తెలివితో... కోర్టుల సహనాన్ని... దేశ ప్రజల మనసుల్ని పరీక్షిస్తున్న వైనంపై పలువురు మండిపడుతున్నారు.

దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ కొత్త వాదన వినిపించేందుకు సుప్రీంకోర్టు తలుపు మరోసారి తట్టారు. న్యాయవాదులు తనను తప్పుదోవ పట్టించిన కారణంగా న్యాయపరంగా తనకున్న హక్కులన్నింటిని మరోసారి దాఖలు పరచాలని కోరుతూ ఎం.ఎల్. శర్మ అనే న్యాయవాది చేత పిటిషన్ దాఖలు చేశాడు.

ఇప్పటివరకూ జారీ చేసిన అన్ని ఉత్తర్వుల్ని కొట్టివేయాలని... రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించటాన్ని కూడా రద్దు చేయాలన్నాడు. తాజా పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. తన ఆరోపణల పర్వంలో కేంద్ర హోం శాఖ... ఢిల్లీ ప్రభుత్వం... వృందా గ్రోవర్‌తోపాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు తాను బలైనట్లుగా వాదిస్తున్నాడు. నిజంగానే అలా జరిగి ఉంటే... ఈపాటికి ఉరిశిక్ష అమలు జరిగి ఏళ్లు గడిచేదేమో? నరహంతకులకు న్యాయసూత్రాల ద్వారా శిక్షించాలం టే ఎలాంటి దరిద్రాలే ఎదురవుతాయన్న విషయం నిర్భయ దోషుల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.