Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... నిర్భయ దోషుల ఉరి వాయిదా

By:  Tupaki Desk   |   31 Jan 2020 1:25 PM GMT
బ్రేకింగ్... నిర్భయ దోషుల ఉరి వాయిదా
X
అనుకున్నంతా అయ్యింది. తమ మెడపై వేలాడుతున్న ఉరిశిక్షను ఎలాగైనా వాయిదా వేయించుకునేందుకు నిర్భయ కేసు దోషులు చేస్తున్న యత్నాలు మరోమారు ఫలించాయి. నిర్భయ దోషుల ఉరిని నిలుపుదల చేస్తూ ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు శనివారం (ఫిబ్రవరి 1న) ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు పంపింది. ఇక ఇదే కేసులో దోషిగా ఉన్న అక్షయ్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే విధంగా కేసులో మరో దోషి అయిన పవన్‌ గుప్తా ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ అంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది.

ఏడేళ్ల క్రితం ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో బయటపడిన నిర్భయ సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌ సింగ్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్‌గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లకు దాదాపు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ క్రమంలో జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్‌ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పటియాలా హౌజ్‌ కోర్టు ఆదేశాలతో మరోమారు ఉరిశిక్ష వాయిదా పడింది.

తాము పాల్పడిన నేరం అత్యంత హేయమైనదని దోషులకు తెలిసినా... ఉరి శిక్ష నుంచి తమను తాము కాపాడుకునేందుకు దోషులు నానా పాట్లు పడుతున్నారు. వీరి యత్నాలకు చట్టంలోని కొన్ని లొసుగులు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ ఒకేసారి క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడానికి బదులుగా ఒకరి తర్వాత ఒకరు కోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఉరి శిక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈ కేసులోని నిందితులకు నలుగురికీ ఒకేసారి ఉరి శిక్ష అమలు చేయాలన్న నిబంధనను కూడా దోషులు తమకు అనుకూలంగా మలచుకున్నారన్న వాదన వినిపిస్తోంది. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని దోషులు ఆడుతున్న నాటకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్నా... చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా దోషుల వాదన మేరకు కోర్టులు శిక్ష అమలును వాయిదా వేయక తప్పడం లేదు. మరి... అన్ని అవకాశాలు ముగిసి దోషులకు ఎప్పుడు శిక్ష అమలవుతుందో చూడాలి.