Begin typing your search above and press return to search.

న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ... నిర్భయ తల్లి మనోవేధన !

By:  Tupaki Desk   |   6 March 2020 10:00 AM GMT
న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ... నిర్భయ తల్లి మనోవేధన !
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. మహిళల భద్రత పట్ల ఆందోళన పెంచిన నిర్భయ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా , నిర్భయ పేరుపై ఆనాటి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చినా కూడా ఇప్పటికి నిర్భయ దోషులకు శిక్ష అమలుకాకపోవడం గమనార్హం. 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి... ఆ పై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రి లో కన్నుమూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురికి అనేక సార్లు ఉరి శిక్ష ఖరారు చేయడం ..ఆ తరువాత మళ్లీ స్టే ఇవ్వడం ఇదే వ్యవహారం గత కొన్నేళ్లు గా కొనసాగుతూనే ఉంది.

దీనిపై తాజాగా నిర్భయ తల్లి తనమనోవేదనని తెలియజేసింది. నాకు చావు అంటే భయం లేదు. నా కూతురి పై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పుకొచ్చారు. అనేక వాయిదాలు , స్టే ల తర్వాత నిందుతులకి మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిర్భయ ఘటన జరిగిన రోజుని . అలాగే నిర్భయ చివరి మాటలని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

గడిచిన ఏడు- ఎనిమిదేళ్ల కాలంలో మేం ఎక్కని కోర్టు మెట్టులేదు. మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు.. అనంతరం సుప్రీంకోర్టు ఇలా అన్నిచోట్లకు వెళ్లాం. సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే మాకు న్యాయం జరిగినట్లేనని భావించాం. దోషుల రివ్యూ పిటిషన్‌ను 2018లో కోర్టు తిరస్కరించగానే సంతోషపడ్డాం. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీ విచారణకు నేను హాజరవుతూనే ఉన్నాను. నా కుటుంబాన్ని వదిలేసి మరీ కోర్టుల చుట్టూ తిరిగాను. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది అని తెలిపింది. అయితే నా కూతురి పట్ల అత్యంత హేయంగా వ్యవహరించిన ఆ మృగాళ్లు తమ లాయర్‌ ను అడ్డు పెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వారి ఎత్తుగడల వల్ల... నా కూతురి మీద అత్యాచారం జరిగిందని నేను పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఎప్పుడైతే దోషులకి ఉరి ఖరారు అయ్యింది అని తెలుస్తుందో.. .. అప్పుడే వాళ్లు పేదవాళ్లు అనే సంగతి గుర్తుకు వస్తుంది. అలాగే, ప్రపంచ మానవ హక్కుల సంస్థ.. ఇలాంటి నేరస్థుల హక్కుల గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఆర్టికల్స్‌ రాసి పేరు సంపాదించుకుంటుంది. మానవ హక్కుల పేరిట పెద్ద వ్యాపారమే చేస్తోంది అని ఆశాదేవి విమర్శించారు. అలాంటివారు జైలు నుండి బయటకి వస్తే ..మళ్లీ ఇంకెన్ని దారుణాలకు పాల్పడతారో ఊహించలేము అని ,ఇలాంటి మృగాళ్లను ఉరితీయాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.