Begin typing your search above and press return to search.

అలా అడుగమ్మా.. అప్పుడైనా వారికి హక్కులు గుర్తుకొస్తాయేమో?

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:53 AM GMT
అలా అడుగమ్మా.. అప్పుడైనా వారికి హక్కులు గుర్తుకొస్తాయేమో?
X
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఘటన జరిగినప్పుడు ఉండే భావోద్వేగం.. ఏళ్లు గడిచిన తర్వాత చాలామందిలో ఉండదు. దారుణమైన దురాగతం జరిగినప్పుడు నోరు తెరవని హక్కుల కార్యకర్తలు.. మానవతావాదులు.. తీరా దోషులకు కఠిన శిక్షలు విధించే సమయంలో వారిలోని కరుణ టన్నుల కొద్దీ పొంగిపొర్లుతుంది. ఇలాంటి ఘటనే మనింట్లో.. మనోళ్లకు జరిగితే అన్న ఆలోచన కూడా వారికి తట్టదు.

ఎంతసేపటికి బతికున్నోళ్ల హక్కుల గురించి మాట్లాడే ఈ మేధావులకు.. వారి కారణంగా జీవితాన్ని దారుణంగా నలిపేసిన వైనం..అర్థారంతంగా ఆగిపోయేలా చేసిన దుర్మార్గం ఎందుకు గుర్తుకు రాదో అర్థం కాదు. ఇలాంటి వారి మాటల ప్రభావమో.. లేక దేశంలోని చట్టాల్లో ఉన్నలోపాల్ని ఏళ్ల తరబడి చూస్తున్న వేళ.. తాము చేసిన ఎదవ పనికి జీవితాన్ని చాలిద్దామన్న పశ్చాతాపం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే తీరు చూసిన ప్రతిసారీ ఆవేశం తన్నుకు రాక మానదు.

తాజాగా నిర్బయ దోషులకు ఉరిశిక్షను ఈ నెల 16న అమలు చేయాలని డిసైడ్ చేసిన నేపథ్యంలో.. ఈ దోషుల్లో ఒకడికి హటాత్తుగా వేదాలు.. పురాణాలు.. ఉపనిషత్తుల్లోని అంశాలు గుర్తుకొచ్చి క్షమాభిక్షను ప్రసాదించాలని వేడుకునే తీరు చూస్తే.. చట్టం పేరుతో ఇన్నాళ్లు ప్రజాధనంతో వారిని పోషించినందుకు బాధపడాలన్న భావన కలుగక మానదు.

అందుకేనేమో.. తాజా పరిణామాలపై ఒళ్లు మండిన నిర్భయ తల్లి తాజాగా నిప్పులు చెరిగారు. నిర్భయ ఉదంతంలో దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు.

అతడు వేదాలు.. పురాణాలు.. ఉపనిషత్తుల్లో అంశాలు ప్రస్తావిస్తున్నాడు. మరి.. నా కూతురు పేగుల్ని బయటకు లాగినప్పుడు.. ఈ ఆలోచనలు ఏమైపోయాయి? వారికి మానవహక్కులు అప్పుడెందుకు గుర్తుకు రాలేదు? ఆమె మరణానికి కారణమైన వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. బాధితులకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఎందుకు నిబంధనలు చూపుతారు? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.