Begin typing your search above and press return to search.

చరిత్ర చెప్పి మరీ సోనియమ్మకు నిర్మలమ్మ కౌంటర్

By:  Tupaki Desk   |   17 Dec 2019 7:50 AM GMT
చరిత్ర చెప్పి మరీ సోనియమ్మకు నిర్మలమ్మ కౌంటర్
X
కింద పడినా పైచేయి మాదేననే తీరును మోడీ సర్కారు ప్రదర్శిస్తుందా? పౌరసత్వ సవరణ బిల్లుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరసనల్ని కఠినంగా అణిచి వేస్తున్న తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్న వేళలో.. తాము చేసిన పనిని సమర్థించుకునేందుకు వీలుగా అధికారపక్షానికి చెందిన కీలక నేతలు వినిపిస్తున్న వాదన వింటే అవాక్కు అవ్వాల్సిందే.

పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనల వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వినిపిస్తున్న వాదన ఆశ్చర్యానికి గురి చేయక మానదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఉద్దేశించి ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మీద దాడి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలేదా? అని ప్రశ్నించటం ద్వారా.. తమ హయాంలో జరుగుతున్న దాడులు తప్పేం కావన్న అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం.

ఇందిరమ్మ హయాంలో ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల్ని తీహార్ జైలుకు పంపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. చరిత్రను గుర్తు చేస్తూ.. అప్పట్లో విద్యా సంవత్సరాన్నే రద్దు చేసిన దానికి సమాధానం ఏం చెబుతారని నిలదీస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని 2003లో కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ కోరిన వైనాన్ని గుర్తు చేశారు.

మానవ హక్కులు కొంతమందికే వర్తిస్తాయా? అంటూ సోనియాను ప్రశ్నించారు. దశాబ్దాలుగా శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్న బెంగాలీ హిందువుల పరిస్థితేమిటన్నది ఆలోచించరా? అని ఆమె ప్రశ్నించారు. హింసను ప్రేరేపించటం బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీది ఎంతమాత్రం కాదని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో హింస.. విబజన రాజకీయాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని సోనియా ఆరోపించిన నేపథ్యంలో సీతారామన్ మండిపడుతూ.. చరిత్రను గుర్తు చేశారు. అంతా బాగుంది కానీ.. ప్రభుత్వాలు ఏమైనా కానీ.. నిరసనలు వ్యక్తం చేసే విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరించటంలో ఇద్దరూ ఇద్దరే అన్న విషయాన్ని తేల్చారని చెప్పక తప్పదు.