Begin typing your search above and press return to search.

అప్పుడు బాబు.. ఇప్పుడు నిర్మ‌లా సీతారామ‌న్‌!

By:  Tupaki Desk   |   6 March 2018 4:35 AM GMT
అప్పుడు బాబు.. ఇప్పుడు నిర్మ‌లా సీతారామ‌న్‌!
X
ఏపీ రెండు ముక్క‌లు కావ‌టం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద చ‌ర్చ జ‌రిగిన ప్ర‌తిసారీ కేసీఆర్ విజ‌యం గురించి మాట్లాడుకునే ప్ర‌తిఒక్క‌రూ.. అస‌లు ఆయ‌న అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌టానికి.. ఆ జ‌ర్నీ షురూ కావ‌టానికి కార‌ణాల్ని ప్ర‌స్తావించ‌టం.. చంద్ర‌బాబు కానీ ఆ త‌ప్పు చేయ‌కుంటే ఇదంతా జ‌రిగేదే కాద‌నుకోవ‌టం క‌నిపిస్తుంది. ఆ రోజున మంత్రి ప‌ద‌విని కేసీఆర్ కు ఇచ్చేసి ఉంటే.. అక్క‌డితో ఆగిపోయేద‌ని.. తెలంగాణ నినాద‌మే తెర మీద‌కు వ‌చ్చేది కాద‌ని చెబుతారు.

చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం తాజాగా తానిచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ కేసీఆర్‌ కు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టాన్ని మిస్టేక్ అని చెప్ప‌టం.. ఆ రోజున అలా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిందంటూ చెప్ప‌టం క‌నిపిస్తుంది. ఒక మామూలు నేత‌ను తెలంగాణ జాతిపిత‌గా ఆవిర్భ‌వించ‌టానికి చంద్రబాబు ఎలా కార‌ణ‌మ‌య్యారో.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. కాస్తా.. జాతీయ‌నేత‌గా ఆవిర్భ‌వించ‌టానికి.. భ‌విష్య‌త్తులో జాతీయ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసేలా నిర్ణ‌యం తీసుకోవ‌టానికి కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గా మారార‌ని చెబుతున్నారు.

మోడీని గాడు అంటూ ఒక బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధానిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారంటూ కొన్ని టేపులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కేసీఆర్ ఇలా మాట్లాడ‌టం నోరు జార‌ట‌మ‌ని కొంద‌రంటే.. ఏదో పొర‌పాటున అలా జ‌రిగి ఉంటుంద‌ని కేటీఆర్.. క‌విత‌లు రియాక్ట్ కావ‌టం తెలిసిందే. అయితే.. తాను నోరు జార‌లేద‌ని.. టేపులు తెప్పించుకొని మ‌రీ చూసిన‌ట్లుగా కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల అనంత‌రం బీజేపీ నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ అయ్యింది లేదు.

అలాంటివేళ హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే క్ర‌మంలో కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని మంత్రి కేటీఆర్ ద‌గ్గ‌ర‌ ప్ర‌స్తావించ‌టం ఒక ఎత్తు అయితే.. వివ‌ర‌ణ కోర‌టం మ‌రో ఎత్తుగా అభివ‌ర్ణిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌టం.. కేటీఆర్ ను ఉద్దేశించి తాను కార్య‌క్ర‌మంలో పాల్గొనాలా? వ‌ద్దా? అంటూ ప్ర‌శ్నించ‌టం ద్వారా కేటీఆర్ వివ‌ర‌ణ ఇచ్చేలా చేయ‌టం కేసీఆర్ కోపానికి కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు.

జాతీయ రాజ‌కీయాల్లో పాగా వేయాల‌న్న ఆలోచ‌న కేసీఆర్ కు ఉన్న‌ప్ప‌టికీ.. అందుకు స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్న ఆయ‌న‌కు.. త‌న కొడును కేంద్ర‌మంత్రి నిల‌దీయాన్ని జీర్ణించుకోలేక‌పోయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట‌లు కేసీఆర్ హ‌ర్ట్ అయ్యేలా చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న కొడుకు క‌మ్ రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి నిర్మ‌లా ప్ర‌శ్నించ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ విష‌యాన్ని మీడియా ముందు ప్ర‌స్తావించి అవ‌మానించిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌మ‌ను ప్ర‌శ్నించ‌టమే లేని తెలంగాణ‌లో.. త‌మ‌పై అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌టం.. ఎదురుదాడి చేయ‌టం.. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకొని త‌న కొడుకు ద‌గ్గ‌ర నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. ఆ త‌ర్వాత ఆమే మీడియా ముందు చెప్ప‌టాన్ని కేసీఆర్ తీవ్రంగా ప‌రిగ‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదే.. జాతీయ రాజ‌కీయాల్లో తాను పోషించాల్సిన పాత్ర విష‌యంలో మ‌రింత వేగ‌వంత‌మ‌య్యేలా చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న‌ను త‌ప్పు ప‌ట్టే అవ‌కాశం ఇవ్వ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ కు.. త‌న‌ను త‌ప్పు ప‌ట్ట‌టం.. త‌న పిల్ల‌ల ద‌గ్గ‌ర వివ‌ర‌ణ కోర‌టం లాంటివి మా చెడ్డ చిరాకును తెప్పించ‌టంతోపాటు.. కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కార‌ణంగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న‌లో నిజం ఎంత ఉన్నా.. నిర్మ‌లా ఎపిసోడ్ త‌ర్వాతే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్ని ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. బీజేపీలో అంత‌మంది నేత‌లు ఉన్నా.. ఎవ‌రికి ప‌ట్ట‌ని "గాడు" మాట నిర్మ‌ల‌కే ఎందుకు ప‌ట్టింద‌న్న‌ది ఇప్పుడు కొంద‌రి నోట వినిపిస్తోంది.