Begin typing your search above and press return to search.

ఫోటోలు ఎందుకు పెట్టాలీ... ఎవరి జేబుల్లో డబ్బు కాదు

By:  Tupaki Desk   |   4 Sep 2022 2:30 PM GMT
ఫోటోలు ఎందుకు పెట్టాలీ... ఎవరి జేబుల్లో డబ్బు కాదు
X
ఇది ప్రజాస్వామ్యం. దానికి అసలైన నిర్వచనం ఏంటి అంటే ప్రజల చేత ప్రజల కొరకు, ప్రజల తరఫున సాగే పాలన. అంటే ప్రజలే ఇక్కడ ప్రభువులు అన్న మాట. ప్రజల తరఫున పాలించే వారు ప్రతినిధులు అవుతారు తప్ప ప్రభువులు ఎప్పటికీ కారు. ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన మౌలిక సూత్రం. దీన్ని పక్కన పెట్టేసి అధికారంలోకి వచ్చిన వారు తామే ప్రభువులు అని భావించడం ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్న ఎపుడూ వస్తూనే ఉంది.

అయితే మరీ ఈ ఆధిపత్యం కానీ అహంకారం కానీ పెరిగినపుడే జనాలలో ఆలోచనలు మొదలవుతాయి. ఇపుడు చూస్తే దేశంలోఎటు చూసినా ఫోటోల గోల ఎక్కువ అయిపోయింది. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు వస్తే ఇవి మా పధకాలు మేము నిధులు ఇస్తున్నామంటూ తెగ రచ్చ చేస్తూంటారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఏపీ పాలన మొత్తం సాగుతోంది అని బీజేపీ నేత సోము వీర్రాజు అంటారు. కేంద్రమే లేకపోతే ఏపీ సంగతేంటి అని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిలదీస్తారు.

ఇక కేంద్ర మంత్రులు ఏపీ కానీ తెలంగాణా కానీ టూర్లకు వచ్చినపుడు తాము ఇచ్చిన డబ్బులు ఏం చేశారంటూ దబాయిస్తారు. ఇది నిజంగా ఫెడరల్ సిస్టం లో చేయాల్సిన విధానమేనా అని అనిపిస్తుంది. రాష్ట్రాలు స్వేచ్చగా ఉంటాయి. వాటి పనులు అవి చేస్తాయి. కేంద్రం నిధులు ఇచ్చిందంటే వాటి మీద ఒక పద్ధతిలో వాకబు చేయవచ్చు కానీ జనంలోకి వచ్చి గగ్గోలు పెట్టడమేంటో ఎవరికీ అర్ధం కాదు, అది ఫక్తు రాజకీయం తప్ప మరేమీ కాదు.

ఇక కేంద్రం నిధులు అంటే అవి ఎవరివి, ఏ మంత్రి జేబుల నుంచి ఇచ్చినవి కావు కదా. ప్రజలు కట్టిన పన్నులే కదా. నిజానికి ఏనాడో స్వర్గీయ ఎన్టీయార్ చెప్పారు. కేంద్రం మిధ్య అని. నిజంగా అదే కదా. రాష్ట్రాలు అన్నీ ఉంటేనే కేంద్రం ఉంటుంది. కేంద్రానికి రావాల్సిన పన్నుల ఆదాయం కూడా రాష్ట్రాల నుంచే వస్తుంది. అలాటపుడు ఈ డబ్బా కబుర్లు దబాయింపులు ఎందుకు అన్నదే ప్రశ్న.

ఇక కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో తెలంగాణాలో టూర్ చేసిన నిర్మలా సీతారామన్ హుందాగా వ్యవహరించడంలేదు అని టీయారెస్ మంత్రులు అంటున్నారు. ఆమె ఒక రేషన్ దుకాణం వద్దకు వెళ్ళి చౌక బియ్యం కేంద్రం ఇస్తోంది కాబట్టి మోడీ బొమ్మ పెట్టాలని కోరుతున్నారు. సరే అలాగే అనుకున్నా బొమ్మ పెడితే జనాలు గుండెల్లో పెట్టుకుని ఓట్లేస్తారా. ఇదంతా చిల్లర రాజకీయం కాకపోతే మరేమిటి. అసలు కేంద్రం చేయాల్సింది ఏమిటి.

ఎన్నో కీలకమైన బాధ్యతలు కేంద్రం మీద ఉన్న. వాటిని పూర్తి చేసి దేశం మొత్తానికి గుర్తుండేలా చూపిస్తే ఒక రాష్ట్రం ఏమిటి దేశమంతా ఆ పార్టీ వైపు చూస్తుంది, అభిమానిస్తుంది. అలాంటివి వదిలేసి గల్లీలకు వచ్చి మా బొమ్మ మా పధకం, మా డబ్బులు అంటూ వీధి పంచాయతీలు పెట్టడం తగునా అన్నది మేధావుల నుంచి వస్తున్న సూతి ప్రశ్న.

చాలా అంశాలు నిజానికి ఉమ్మడి జాబితా లో నుంచి తీసేయాలని రాష్ట్రాలకు ఇచ్చేయాలని కూడా చాలా కాలంగా వాదన ఉంది. కేంద్రం అంటే ముఖ్యంగా చేయాల్సింది దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలు చూడడం, అలాగే దేశానికి పెద్దన్నలా రాష్ట్రాలకు బాసటగా ఉండడం. అంతే తప్ప విద్య, పోలీసింగ్, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా చాలా విషయాల్లో ఉమ్మడి జాబితాలో ఉంచుకోవడం ఎందుకు. కేవలం ఇదంతా ఆధిపత్యం కోసం తప్ప అన్న చర్చ కూడా వస్తోంది.

ఈ దేశంలో నదీ జలాలు జీవ నదులు అన్నీ కూడా సముద్రంలో కలసిపోతున్నాయి. వాటిని అనుసంధానించి దేశంలో అందరూ ఆ నీటిని వాడుకునేలా తాగు, సాగు, పరిశ్రమలకు విద్యుత్ కోసం ఉపయోగించుకునేలా కేంద్రం భారీ పధకాలు చేపడితే దేశమంతా హర్షిస్తుంది. ఇక ఇరుగు పొరుగు దేశాలతో సామరస్యంగా ఉండడం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం వంటి పెద్ద పనులే కేంద్రానికి ఉన్నాయి. అంతే తప్ప పంచాయతీ ఆఫీసులకు వచ్చి ప్రధాని బొమ్మ ఉందా లేదా అని వాకబు చేయడం కాదు.

ఆ మాటకు వస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమ పధకాలు అమలు చేసే వారు వాటి మీద ముఖ్యమంత్రులు, ప్రధానుల బొమ్మలను పెట్టుకోవడం ముమ్మాటికీ తప్పే అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఎవరి జేబుల్లో నుంచి ఇస్తున్న డబ్బు కాదు, ప్రజలు తమ రక్తం కరిగించి పన్ను రూపంలో కడుతున్న మొత్తం. అందువల్ల ఏ పధకం మీద కూడా నాయకుల బొమ్మలు లేకుండా చూస్తే అది దేశానికి చాలా మంచిది అన్న సలహా సూచనలు కూడా వస్తున్నాయి.