Begin typing your search above and press return to search.

మోదీ స్టామినా ఏంటో... నిర్మలమ్మ చెప్పేసిందిగా

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:14 PM GMT
మోదీ స్టామినా ఏంటో... నిర్మలమ్మ చెప్పేసిందిగా
X
నరేంద్ర మోదీ... భారత ప్రధానిగా వరుసగా రెండో దఫా పదవీ బాధ్యతలు చేపట్టిన ధీశాలి. అంతేనా... భారత దేశంలో మూడు దశాబ్దాల తర్వాత సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ ప్రపంచ దేశాధినేతలంతా కితాబిచ్చిన నేత. తొలి టెర్మ్ ఎలాగోలా నెట్టుకొచ్చిన మోదీ... రెండో దఫా మాత్రం ఆదిలోనే తేలిపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదన బలంగా వినిపించడమే కాదండోయ్... చాలా స్పష్టంగా- క్లిస్టర్ క్లియర్ గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిజమా? అంటే... కళ్లెదుటే గణాంకాలు కనిపిస్తుంటే... మోదీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నడిపిస్తున్న మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఎలాంటి బేషజం లేకుండా చెబితే కూడా నమ్మక తప్పని పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడానికే ప్రజలు తనకు అధికారాన్ని కట్టబెట్టారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వద్దనుకున్నా కూడా చెవుల్లో గింగిరాలు తిరుగుతున్నాయి. దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తారని ప్రజలు నమ్మకం పెట్టుకుంటే.. మోదీ మాత్రం దేశాన్ని అధో:గతి బాట పట్టించేశారు. ఇదేదో... మోదీ అంటే గిట్టని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. ప్రణాళిక సంఘం వద్దంటూ దానిని రద్దు చేసి, దేశ పురోభివృద్ధికి రాచబాట వేస్తుందంటూ మోదీనే స్వయంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఈ కఠోర వాస్తవాన్ని కళ్లకు కట్టేసింది. దేశ ఆర్థిక పరిస్థితి మందగించిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్య చేశారు. మొత్తంగా దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ... ఇప్పుడు దేశాన్ని తిరోగమన బాట పట్టించేశారు.

ఎవరు ఔనన్నా, ఎదురు కాదన్నా కూడా ఇది ముమ్మాటికీ నిజమేనని చెప్పాలి. దేశ అభివృద్ధి ఇప్పుడు రికార్డు స్థాయికి పడిపోయింది. ఇలా పడిపోగానే... అలా లేపేద్దామంటే కూడా సాధ్యం కానంత దుర్భర పరిస్థితులపై ఇప్పుడు లెక్కలేనన్ని కథనాలు... సచిత్ర సాక్ష్యాలతో కనిపిస్తున్నాయి. ఒక్కటి కాదు.. ప్రతి రంగంలోనూ ఈ తరహా దుస్థితి చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ తరహా పరిస్థతి దాదాపుగా అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనలో పడేసింది. అయినా మోదీ ఏరికోరి మరీ ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించిన నిర్మల... దేశ తిరోగమన అభివృద్ధి పథంపై ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందుతున్నానని చెప్పలేను. అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నప్పటికీ మునిగిపోకుండా నీటికి ఉపరితలంపైనే భారత్ తన తలను ఉంచగలుగుతోంది’ అని ఆమె దేశ ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగోలేదని నిర్మోహమాటంగానే చెప్పేశారు. ఇక ఇదే భావనను మరింత కటువైన వ్యాఖ్యలతో బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ కూడా వ్యక్తీకరించారు. ‘ ఓ పక్క డిమాండ్ లేదు. మరోపక్క ప్రైవేట్ పెట్టుబడులూ లేవు. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఊడిపడుతుందా?’ అంటూ బజాజ్ చేసిన వ్యాఖ్యలు... మోదీ సర్కారు విధానాలు పారిశ్రామిక రంగాన్ని ఏ స్థాయిలో నిరాశానిస్పృహలకు గురి చేస్తున్నాయో ఇట్టే చెప్పేస్తున్నాయి. ఓ వైపు నిర్మల నిరాశాపూరిత వ్యాఖ్యలు, మరోవైపు బజాజ్ ఆగ్రహావేశాలతో కూడిన స్పందన చూస్తుంటే... భారత ఆర్థిక పరిస్థితి గానీ, దేశ అభివృద్ధి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యాఖ్యలు సరే... మరి దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న పారిశ్రామిక ప్రగతి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం పదండి.

దేశీయ కార్ల తయారీకి ఆద్య కంపెనీగా నిలిచిన మారుతీ అమ్మకాలు ఒకేసారి 30 శాతం పడిపోయాయి. గడచిన 20 ఏళ్లలో ఏనాడూ ఆ కంపెనీ ఈ తరహా తిరోగమనాన్ని చవిచూడలేదట. దేశంలోని పరిశ్రలమ వృద్ధి రేటు ఈ జూన్ ఒక్క నెలలోనే 0.2 శాతం మేర పడిపోయింది. ఇది 50 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇక దేశంలో పేరొందిన ఆటోమొబైల్ కంపెనీలు 11 ఉంటే... వాటిలో 9 కంపెనీల లాభాలు జూలై నెలలో రెండంకెల మేర పడిపోయింది. గడచిన 9 నెలలుగా ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. వెరసి ఆ కంపెనీలు నష్టాల బాటలో పడకున్నా... లాభాలు మాత్రం క్రమేణా తగ్గిపోతున్నాయి. వరుసగా లాభాలు తగ్గడం, 9 నెలలుగా ఒక్క నెలలోనూ పెరుగుదల లేకపోవడం అంటే... సమీప భవిష్యత్తులో ఆ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి నష్టాలు వస్తుంటే.. ఆ కంపెనీలు కళ్లు మూసుకుని ముందడుగు వేయలేవు కదా. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టిన చాలా కంపెనీలు కొత్తగా లేఆఫ్ లను ప్రకటిస్తున్నాయి. టాటా మోటార్స్ ఇప్పటికే లే ఆఫ్ లను ప్రకటించేసింది. వారానికి మూడు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపేస్తోంది. ఆదివారం సెలవుతో కలుపుకుంటే... ఈ ఉత్పత్తి నిలిపివేత వారానికి నాలుగు రోజులకు చేరుకుంటోంది. ఈ తరహా పరిస్థితి టాటా మోటార్స్ కే తప్పలేదంటే.. మిగిలిన కంపెనీల పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.

సరుకుల అమ్మకాల్లో తమదైన రీతి వృద్దిలో దూసుకుపోతున్న హిందూస్థాన్ యూనీలివర్- ఐటీసీ- గోద్రెజ్ కంపెనీలు 2019-20 తొలి త్రైమాసికంలో కేవలం సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే ప్రకటించడం కూడా దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేదేనని చెప్పవచ్చు. ఇక పొదుపు ఖాతాల్లో సొమ్ము కూడా క్రమంగా పడిపోతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ఈ సొమ్ము 22 శాతం ఉండగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇది 17 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు 18.3 శాతం మేర పెరుగుతాయని నిర్మల అంచనా వేయగా... తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. అంటే నిర్మలమ్మ అంచనాను వసూళ్లు అందుకోవాలంటే... మిగిలిన నెలల్లో 22.3 శాతం మేర వృద్ది సాధించి తీరాలి. ఇది దాదాపుగా దుస్సాధ్యమేనని చెప్పాలి. ఈ లెక్కన ఏ అంశాన్ని చూసినా తిరోగమనే కనిపిస్తోంటే... దేశాన్ని అభివృద్ధి బాటలో మోదీ ఎలా నడిపించగలరు. నిజమే... తిరోగమన బాట పట్టిన దేశ అభివృద్ధిని మోదీ ఇప్పటికిప్పుడు చక్కదిద్దే అవకాశాలే లేవు. మరి ఈ తిరోగమనానికి ఏం మందు వేస్తారో చూడాలి.