Begin typing your search above and press return to search.

నిర్మలమ్మను దులిపేయాల్సిన టైం వచ్చేసినట్లేనా?

By:  Tupaki Desk   |   9 Sep 2016 11:30 PM GMT
నిర్మలమ్మను దులిపేయాల్సిన టైం వచ్చేసినట్లేనా?
X
ఉద్యమ అధినేతలకు ఒక లక్షణం ఉంటుంది. తమ లక్ష్య సాధనలో భాగంగా తొలుత.. తమను టార్గెట్ చేసే వారిని బలహీనపరుస్తారు. వారి పోరాట పటిమ మీద ప్రభావం పడేలా వ్యవహరిస్తారు. తమకు ఎదురు నిలబడే అవకాశం లేకుండా చేయటం ద్వారా మిగిలినవారెవరూ వేలెత్తి చూపించే సాహసం చేసేందుకు సైతం భయపడే పరిస్థితి తీసుకొస్తారు. పవన్ తాజా వ్యవహారశైలి చూస్తే ఇదే విషయం బోధ పడుతుంది. తనపై విరుచుకుపడే వారిని ఏ మాత్రం వదిలిపెట్టని ఆయన.. తనపై చేసిన విమర్శలకు తగ్గట్లుగా తాజాగా స్పందించినట్లు కనిపించక మానదు. తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వారిని తనదైన శైలిలో పంచ్ లు వేసిన పవర్ స్టార్.. ఏపీ అధికారపక్ష రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కర్నూలులో ఉన్న ఆయన పరిశ్రమ నుంచి కాలుష్యం వెదజల్లుతుందన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. మరో ఎంపీ మురళీమోహన్ విషయంలో కాస్త సున్నితంగా స్పందించారని చెప్పాలి. తన తీరును ఘాటుగా విమర్శించిన జేసీ దివాకర్ రెడ్డి విషయంలో చూసీ చూడనట్లుగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. ఇక.. ఏపీకి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని ఓ రేంజ్ లో వేసుకున్న పవన్.. మరెవరినీ ఆ స్థాయిలో ఏసుకోలేదని చెప్పక తప్పదు.

ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మీద ఎవరు నోరు విప్పినా.. ప్రతికూలంగా మాట్లాడినా చెంప పగిలిపోయేలా మాటలు తప్పవన్న సందేశాన్ని పవన్ పంపినట్లుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హోదా మీద వ్యాఖ్యలు చేశారు. హోదాను అడిగే ముందు పార్టీలు తగినంత హోంవర్క్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

రాజకీయ పార్టీలు కేవలం హోదా కావాలంటూ దాన్ని సమస్యగా చేస్తున్నాయని.. అసలు కేంద్రం ఏం ఇచ్చిందో తెలుసుకోవాలంటే ముందు తగినంత హోంవర్క్ చేయాలన్నారు. కేవలం భావోద్వేగాలతో మాట్లాడటం కాకుండా.. ఇప్పుడు చేసిన సాయంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా? లేదా? అన్న అంశం మీద చర్చ జరగాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరం కట్టుబడి ఉన్నామన్న ఆమె.. ముందు ప్యాకేజీ వివరాలు చూడాలని.. ఇప్పటివరకూ ఏమేం హామీలు ఇచ్చారన్నది తెలుసుకోవాలన్నారు. నిర్మలమ్మ మాటలు చూస్తుంటే.. రానున్న పవన్ సభలో ఆమె టార్గెట్ మారటం ఖాయమన్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. హోంవర్క్ చేయాలంటున్న నిర్మలా సీతారామన్.. ఎంత హోంవర్క్ చేసి ఏపీకి ప్రత్యేక హోదాకు ఓకే చేశారు? ఇప్పుడెంత హోంవర్క్ చేసి ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పారన్న విషయాన్ని ముందుగా చెబితే బాగుంటుందని చెప్పొచ్చు.